Tuesday, 6 October 2020

శ్రీ కృష్ణ విజయము - 49

( సుదాముని మాలలు గైకొనుట )

10.1-1267-వ.
అంత నా రామకృష్ణులు సుదాముం డను మాలాకారు గృహంబునకుం జనిన; నతండు గని లేచి గ్రక్కున మ్రొక్కి చక్కన నర్ఘ్య పాద్యాదికంబు లాచరించి; సానుచరు లయిన వారలకుఁ దాంబూల కుసుమ గంధంబు లొసంగి యిట్లనియె.
10.1-1268-ఉ.
"పావన మయ్యె నా కులము; పండెఁ దపంబు; గృహంబు లక్ష్మికిన్
సేవిత మయ్యె; నిష్ఠములు సేకుఱె; విశ్వనిదానమూర్తులై
భూవలయంబుఁ గావ నిటు పుట్టిన మీరలు రాకఁ జేసి నే
నే విధ మాచరింతుఁ? బను లెయ్యెవి? బంట; నెఱుంగఁ జెప్పరే."
10.1-1269-వ.
అని పలికి.

భావము:
ఆ తరువాత, రామకృష్ణులు పూలదండలు కట్టే సుదాముడి ఇంటికి వెళ్ళారు. అతడు వారిని చూసి వెంటనే లేచి నమస్కరించాడు. చక్కగా ఆర్ఘ్యము, పాద్యము, మొదలైన విధులతో సత్కరించాడు. రామకృష్ణులకూ, వారి వెంట వచ్చినవారికీ తాంబూలములు, పూలు, గంధములు ఇచ్చి ఇలా అన్నాడు. “జగత్తుకు ఆదికారణమూర్తులైన మీరు భూలోకాన్ని సంరక్షించడం కోసం ఇలా అవతరించారు. అటువంటి మీరాక వలన మా వంశం పవిత్రమయింది. నా తపస్సు ఫలించింది. నా ఇల్లు సిరిసంపదలతో నిండింది. నా కోరికలు ఈడేరాయి. నేను ఏ విధంగా నడచుకోవాలి? ఏం పనులు చెయ్యాలి? నేను మీ బంటును. సెలవియ్యండి.” ఇలా అని ఆ మాలాకారుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=147&padyam=1268

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...