Thursday, 15 October 2020

శ్రీ కృష్ణ విజయము - 54

( కుబ్జననుగ్రహించుట )

10.1-1280-సీ.
ఇవ్విధంబునఁ గుబ్జ యిచ్చిన లేపంబు-
  లన్నియుఁ దాను దేహమున నలఁది
కొని ప్రసన్నత నొంది కుబ్జ మువ్వంకల-
  యొడలు చక్కఁగ నొత్తి యునుపఁ దలఁచి
తత్పదంబుల మీఁదఁ దన పదంబులు ద్రొక్కి-
  హస్తాంగుళద్వయ మబల గవుద 
క్రింద విప్పుగ నిడి కృష్ణుఁడు మీఁదికి-
  నెత్తఁగ వక్రత లెల్ల మాని
10.1-1280.1-ఆ.
చక్కనైన చిత్తజన్ముబాణము క్రియఁ
గొమరుమిగిలి పిఱుఁదుఁ గుచయుగంబు
సొంపుఁ జేయఁ దరుణి సుందరమూర్తి యై
కమలనయనుఁ జూచి కాంక్షతోడ.
10.1-1281-క.
"వేంచేయుము నా యింటికిఁ
బంచశరాకార"! యనుచుఁ బైకొం గాక
ర్షించి హరిఁ దిగిచెఁ గామిని
పంచాశుగబాణజాల భగ్నహృదయయై.

భావము:
ఇలా కుబ్జ ఇచ్చిన మైపూతలు అన్నీ కృష్ణుడు తన వంటి నిండా రాసుకుని ప్రసన్నుడయ్యాడు. మువ్వంపులు గల దాని దేహాన్ని చక్కనొత్తి ఆమెను అనుగ్రహంచ దలచాడు. దాని పాదాల మీద తన పాదాలు వేసి త్రొక్కిపట్టాడు. తన చేతి రెండు వేళ్ళను దాని గడ్డము క్రింద పెట్టి దేహము చక్కగా సాగేలా పైకెత్తాడు. అంతే ఆమె వంపులు తీరి మన్మథుడి సమ్మోహనాస్త్రం అన్నంత అందగత్తె అయిపోయింది. పిరుదులు, చనుగవ సొంపు మీరగా, కుబ్జ చక్కని చుక్క అయింది. ఆమె కమలాక్షుడి వైపు కాంక్షతో చూసి మదనుని బాణాలు తాకి కుబ్జ హృదయం చెదిరింది. కృష్ణుడిని కామిస్తున్న, ఆ కామిని “మన్మథాకారా! నా ఇంటికి దయ చెయ్యి” అంటూ అతడి కండువా చెంగు పట్టుకుని లాగుతూ పిలిచింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=148&padyam=1280

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...