Thursday, 29 October 2020

శ్రీ కృష్ణ విజయము - 62

( మల్లరంగ వర్ణన )

10.1-1310-సీ.
పాషాణ వల్మీక పంకాది రహితంబు;
మృదులకాంచననిభ మృణ్మయంబు
గమనీయ కస్తూరికా జలసిక్తంబు;
బద్ధచందనదారు పరివృతంబు
మహనీయ కుసుమదామధ్వజ తోరణ;
మండితోన్నత మంచ మధ్యమంబు
బ్రాహ్మణ క్షత్రాది పౌరకోలాహలం;
బశ్రాంత తూర్యత్రయాంచితంబు
10.1-1310.1-ఆ.
నిర్మలంబు సమము నిష్కంటకంబునై
పుణ్యపురుషు మనముఁ బోలి కంస
సైన్య తుంగ మగుచు సంతుష్ట లోకాంత
రంగమైన మల్లరంగ మొప్పె.
10.1-1311-క.
ఆ మల్లరంగ పరిసర
భూమిస్థిత మంచమందు భోజేంద్రుఁడు మా
న్యామాత్యసంయుతుండై
భూమీశులు గొలువ నుండెఁ బొక్కుచు నధిపా.

భావము:
మహారాజు కంసుడు మల్లయుద్ధానికి సిద్ధం చేయించిన క్రీడాప్రాంగణము రాళ్ళు పుట్టలు బురద మున్నగునవి లేకుండా మెత్తని బంగారువన్నెమట్టితో ఒప్పింది. దానికి కమ్మని కస్తూరి జలంతో కళ్ళాపి జల్లారు. చుట్టూ గంధం కఱ్ఱలతో కంచె అమర్చారు. పెద్ద పెద్ద పూల దండలతో, జండాలతో, తోరణాలతో అలంకరించారు. ఎత్తయిన ఆసనముల మధ్య ఆ రంగం నిర్మించారు. అది బ్రాహ్మణులు క్షత్రియులు మొదలగు పురప్రజల కోలాహలంతో నిండి ఉంది. ఎడతెగకుండా మ్రోగుతున్న వాద్యాల ధ్వనులతో అతిశయించింది. అది పుణ్యపురుషుడి మానసంలా మాలిన్యం లేనిది. సమంగా కంటక రహితమై శోభిల్లేది. అది కంసుడి సైన్యంతో ఉన్నతమై ఒప్పారేది. జనుల మనసులను సంతోషం కలిగించేది. ఆ మల్లరంగానికి దగ్గరలో ఉన్న ఆసనం మీద భోజమహారాజు కంసుడు మాన్యులగు మంత్రులతో కూడి సామంతులు సేవిస్తుండగా భేదపడుతూ కూర్చుని ఉన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=154&padyam=1311

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...