10.1-1658-క.
ఘట కుడ్య సన్నిభం బగు
చటుల కళేబరముఁ జొచ్చి జనపతి నంచుం
బటు చతురంగంబులతో
నిటునటుఁ దిరుగుదును నిన్ను నెఱుఁగమి నీశా!
10.1-1659-ఆ.
వివిధ కామ లోభ విషయ లాలసు మత్తు
నప్రమత్తవృత్తి నంతకుండ
వైన నీవు వేళ యరసి త్రుంతువు సర్ప
మొదిఁగి మూషకంబు నొడియు నట్లు.
10.1-1660-క.
నరవరసంజ్ఞితమై రథ
కరిసేవితమైన యొడలు కాలగతిన్ భీ
కరమృగభక్షితమై దు
స్తరవిట్క్రిమిభస్త్రిసంగతం బగు నీశా!
భావము:
ప్రభూ! నిన్ను తెలుసుకోకపోవడంతో; కుండ గోడ వలె జడమైన చంచలమైన దేహంలో ప్రవేశించి, నేను రాజు నంటూ రథ, గజ, తురగ, పదాతులతో విఱ్ఱవీగుతూ, భూమి మీద అటునిటు తిరుగుతున్నాను. అంతులేని కోరికలతో శబ్దాది విషయము లందు ఆశ వహించి ఏమఱి ఉండగా. నీవు మాత్రం ఏమరుపాటు చెందక అంతక స్వరూపుడవై, పాము కనిపెట్టి ఉండి తటాలున ఎలుకను పట్టినట్లు, సమయం రాగానే పట్టి విషయలాలసులను హరిస్తావు. మాధవా! రాజును అని పేరు వహించి రథాల మీద, ఏనుగుల మీద ఎక్కి తిరిగిన ఈ శరీరం కాలవశమై భయంకరము లైన జంతువులచే భక్షింపబడటం వలన పురీషమనీ, మురిగిపోతే పురుగులనీ, కాలిపోతే బూడిద అనీ వ్యవహరింపబడుతోంది.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=199&padyam=1660
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment