Monday, 15 March 2021

శ్రీకృష్ణ విజయము - 168

( రతీప్రద్యుమ్నులాగమనంబు )

10.2-39-క.
"చచ్చినబాలుఁడు గ్రమ్మఱ
వచ్చిన క్రియ వచ్చెఁ బెక్కువర్షములకు నీ
సచ్చరితు నేఁడు గంటిమి;
చెచ్చెర మున్నెట్టి తపము సేయంబడెనో?"
10.2-40-వ.
అని యంతఃపుర కాంతలును, దేవకీవసుదేవ రామకృష్ణులును యథోచితక్రమంబున నా దంపతుల దివ్యాంబరాభరణాలంకృతుల సత్కరించి సంతోషించిరి; రుక్మిణీదేవియు నందనుం గౌఁగిలించు కొని.
10.2-41-శా.
"అన్నా! నా చనుఁ బాపి నిన్ను దనుజుం డంభోనిధిన్ వైచెనే
యెన్నే వర్షము లయ్యెఁ బాసి సుత! నీ వేరీతి జీవించి యే
సన్నాహంబున శత్రు గెల్చితివొ? యాశ్చర్యంబు సంధిల్లెడిన్
నిన్నుం గాంచితి నింతకాలమునకున్ నే ధన్యతం జెందితిన్. "

భావము:
“ఎన్ని ఏళ్ళకు ఈ బాలుడిని చూడగలిగాము. మరణించిన బాలుడు తిరిగి బ్రతికిరావడం లాంటిదే కదా ఇది. ఈ బాలుడిని తిరిగి చూడడానికి మనం పూర్వజన్మలో ఏం తపస్సులు చేశామో?” అని అనుకుంటూ అంతఃపుర కాంతలూ, దేవకీ వసుదేవులూ, బలరామ కృష్ణులూ మంచి మంచి వస్త్రాభరణాలతో రతీప్రద్యుమ్నులను సత్కరించి సంతోషించారు. రుక్మిణీదేవి తన కొడుకుని కౌగలించుకుని “నాయనా! రాక్షసుడు నిన్ను నానుండి వేరుచేసి నిన్ను సముద్రంలో పడేసి ఎన్నో సంవత్సరాలైంది. ఇన్నాళ్ళూ ఓ కుమారా! నీవు ఎలా బ్రతికావో, ఎలా ఆ రాక్షసుణ్ణి సంహరించావో? చాలా ఆశ్చర్యంగా వుంది. ఇంత కాలానికి మళ్ళీ నిన్ను చూసి నేను ధన్యురాలిని అయ్యాను.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=4&Padyam=41

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...