Wednesday, 17 March 2021

శ్రీ కృష్ణ విజయము - 173

( ప్రసేనుడు వధింపబడుట )

10.2-54-వ.
అంత.
10.2-55-చ.
అడరెడు వేడ్కఁ గంఠమున నమ్మణిఁ దాల్చి, ప్రసేనుఁ డొక్క నాఁ
డడవికి ఘోరవన్యమృగయారతి నేగిన, వానిఁ జంపి పైఁ
బడి మణిఁ గొంచు నొక్క హరి పాఱఁగ, దాని వధించి డాసి యే
ర్పడఁ గనె జాంబవంతుఁడు ప్రభాత్తదిగంతము నా శమంతమున్.
10.2-56-క.
కని జాంబవంతుఁ డా మణిఁ
గొనిపోయి సమీప శైలగుహఁ జొచ్చి ముదం
బునఁ దన కూరిమిసుతునకు
ఘనకేళీకందుకంబుగాఁ జేసె, నృపా!

భావము:
అలా మహారాజుకి ఇవ్వకుండా సత్రాజిత్తు శమంతక మణిని తన ఇంటికి తీసుకుపోయిన అనంతరం ప్రసేనుడు సత్రాజిత్తు తమ్ముడు. అతను ఎంతో కుతూహలంతో శమంతకమణిని కంఠమున ధరించి క్రూరమృగాలను వేటాడే నిమిత్తం అడవికి వెళ్ళాడు. ఆ అడవిలో ఒక సింహం ప్రసేనుడిని చంపి, ఆ మణిని నోట కరచుకుని వెళ్తుండగా జాంబవంతుడు ఆ సింహాన్ని సంహరించి సకల దిక్కులను వెలుగులు నింపుతున్న ఆ మణిని చూసాడు. జాంబవంతుడు ఆ మణి మెఱుగులు చూసి తీసుకుని దగ్గరలో నున్న కొండగుహ లోనికి వెళ్ళి అక్కడ ఉన్న తన ప్రియకుమారునికి ఆటబంతిగా ఆనందంగా ఆ మణిని అమర్చాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=6&Padyam=56

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...