Saturday, 20 March 2021

శ్రీకృష్ణ విజయము - 177

( జాంబవతి పరిణయంబు )

10.2-66-శా.
స్పష్టాహంకృతు లుల్లసిల్ల హరియున్ భల్లూకలోకేశుఁడున్
ముష్టాముష్టి నహర్నిశంబు జయసమ్మోహంబునం బోరుచోఁ
బుష్టిం బాసి ముకుంద ముష్టిహతులం బూర్ణశ్రమోపేతుఁడై
పిష్టాంగోరు శరీరుఁడై యతఁడు దా భీతాత్ముఁడై యిట్లనున్.
10.2-67-వ.
“దేవా! నిన్నుఁ బురాణపురుషు నధీశ్వరు విష్ణుం బ్రభవిష్ణు నెఱుంగుదు; సర్వభూతంబులకుం బ్రాణ ప్రతాప ధైర్యబలంబులు నీవ; విశ్వంబునకు సర్గస్థితిలయంబు లెవ్వరాచరింతురు, వారికి సర్గ స్థితిలయంబులఁ జేయు నీశ్వరుండవు నీవ; యాత్మవు నీవ” యని మఱియును.

భావము:
కృష్ణ జాంబవంతులు ఇలా విజయం పొందాలనే కోరికతో అహోరాత్రాలు ముష్టాముష్టిగా పోరాడగా పోరాడగా. (ఇరవై ఎనిమిది రోజులకు) శ్రీకృష్ణుడి పిడికిలిపోట్లకు జాంబవంతుడి బలం తరిగిపోయింది. అలసట అధికమైంది. అవయవాలన్నీ పిండి పిండి అయిపోయాయి. అప్పుడు జాంబవంతుడు భయకంపితుడై కృష్ణపరమాత్మునితో ఇలా అన్నాడు. “దేవా! పురాణపూరుషుడవు; జగన్నాయకుడవు; విష్ణుడవు; ప్రభవిష్ణుడవు; నీవని నేను తెలుసుకున్నాను; సర్వప్రాణులకూ ప్రాణము, ప్రతాపము, ధైర్యము, బలము నీవే; ఈ ప్రపంచము సృష్టికి, స్థితికీ, వినాశనానికి ఎవరు కారకులో వారి సృష్టి స్థితి లయాలు చేసే పరమేశ్వరుడవు; ఆత్మస్వరూపుడవు నీవే.” అని ఇంకా ఇలా స్తుతించాడు


http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=8&Padyam=67

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...