Wednesday, 24 March 2021

శ్రీకృష్ణ విజయము - 179

( జాంబవతి పరిణయంబు )

10.2-70-క.
"ఈ మణి మాచేఁ బడె నని
తామసు లొనరించు నింద దప్పెడు కొఱకై
నీ మందిర మగు బిలమున
కే మరుదెంచితిమి భల్లుకేశ్వర! వింటే! "
10.2-71-వ.
అనిన విని సంతసించి జాంబవంతుఁడు మణియునుం, దన కూఁతు జాంబవతి యను కన్యకామణియునుం దెచ్చి హరికిం గానికఁగా సమర్పించె; నటమున్న హరివెంట వచ్చిన వారలు బిలంబువాకిటం బండ్రెండు దినంబులు హరిరాక కెదురుచూచి వేసరి వగచి పురంబునకుం జని; రంత దేవకీవసుదేవులును రుక్మిణియును మిత్ర బంధు జ్ఞాతి జనులును గుహ సొచ్చి కృష్ణుండు రాక చిక్కె నని శోకించి.
10.2-72-క.
"దుర్గమ మగు బిలమున హరి
నిర్గతుఁడై చేరవలయు నేఁ" డని పౌరుల్‌
వర్గములై సేవించిరి
దుర్గం గృతకుశలమార్గఁ దోషితభర్గన్.

భావము:
“ఓ భల్లూకరాజా! ఈ శమంతకమణిని నేను అపహరించాను అని అజ్ఞానులు నాపై అపనింద వేసారు. దానిని తొలగించుకోవడానికి నీ మందిరమైన ఈ గుహకు నేను వచ్చాను.” అలా శ్రీకృష్ణుడు చెప్పడంతో. జాంబవంతుడు సంతోషించి, శమంతకమణిని ఆ మణితోపాటే తన కుమార్తె అయిన జాంబవతి అనే పేరు కల కన్యకామణిని తెచ్చి హరికి కానుకగా ఇచ్చాడు. అక్కడ శ్రీకృష్ణుడితో పాటు వచ్చి గుహద్వారం దగ్గర నిలచిన వారందరూ పన్నెండు రోజులు శ్రీకృష్ణుడి కోసం ఎదురు చూసి, వేసారి, దుఃఖించి, ద్వారకకు తిరిగివెళ్ళారు. దేవకీ వసుదేవులు రుక్మిణి తక్కిన బంధుమిత్రులు దాయాదులు గుహలో ప్రవేశించిన కృష్ణుడు తిరిగిరా నందుకు శోకించి దుర్గమమైన ఆ బిలంలో ప్రవేశించిన శ్రీకృష్ణుడు క్షేమంగా తిరిగిరావాలని కోరుతూ పౌరులంతా, క్షేమకర మైన దారిని అనుగ్రహించే తల్లి, దుర్గాదేవిని ప్రార్థించారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=8&Padyam=72

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...