Friday, 11 June 2021

శ్రీకృష్ణ విజయము - 255

( రుక్మిణిదేవి స్తుతించుట )

10.2-249-వ.
శబ్ద స్పర్శ రూప రస గంధంబు లనియెడు గుణంబులచేతఁ బరిగ్రహింపఁబడిన మంగళ సుందర విగ్రహుండవై, యజ్ఞానాంధకార నివారకంబైన రూపంబుఁ గైకొని, భవదీయులైన సేవకులకు ననుభావ్యుండ వైతి; భవత్పాదారవింద మకరందరసాస్వాద లోలాత్ములైన యోగీంద్రులకైనను భవన్మార్గంబు స్ఫుటంబు గా; దట్లగుటం జేసి యీ మనుజపశువులకు దుర్విభావ్యంబగుట యేమిసెప్ప? నిట్టి యీశ్వరుండవైన నీకు నిచ్ఛ స్వతంత్రంబు గావున నదియును నా కభిమతంబు గావున నిన్ను నే ననుసరింతు; దేవా! నీవకించనుఁడవైతేని బలిభోక్తలయిన బ్రహ్మేంద్రాదు లెవ్వనికొఱకు బలిసమర్పణంబు సేసిరి? నీవు సమస్త పురుషార్థమయుండ వనియును, ఫలస్వరూపి వనియును నీ యందలి ప్రేమాతిశయంబులం జేసి విజ్ఞానదీపాంకురంబున నిరస్త సమస్త దోషాంధకారులై యిహసౌఖ్యంబులు విడిచి సుమతులు భవదీయదాస సంగంబు గోరుచుండుదు; రట్లు సేయనేరక నిజాధికారాంధకారమగ్ను లైన వారు భవత్తత్త్వంబు దెలిసి బలిప్రక్షేపణంబులు సేయంజాలక మూఢులై సంసారచక్రంబునం బరిభ్రమింతు; రదియునుంగాక.

భావము:
దేవా! శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనే గుణాలచేత పరిగ్రహింబడిన మంగళాకారుడవు నీవు. అజ్ఞానాంధకారాన్ని తొలగించే రూపాన్ని పొంది నీభక్తులచే సేవింపబడుతున్నావు. నీ పాదపద్మ మకరందరసాన్ని ఆస్వాదించే యోగీంద్రులకు కూడా నీ మార్గం అంతుపట్టదు. ఇంక ఈ మానవ పశువులకు ఊహింపను కూడా రానిది కావడంలో ఆశ్చర్యము ఏముంది? ఇట్టి పరమేశ్వరుడైన నీవు స్వతంత్రుడవు. నిన్ను నేను అనుసరిస్తున్నాను. నీవు దరిద్రుడవైతే పూజాద్రవ్యాలను స్వీకరించే బ్రహ్మేంద్రాది దేవతలు పూజాద్రవ్యాలను ఎవరికి సమర్పిస్తున్నారు. నీవు సమస్త పురుషార్థ మయుడవనీ, ఫలస్వరూపివనీ భావించి నీ మీది ప్రేమచేత సమస్తదోషాలనే అంధకారాన్ని విజ్ఞాన మనే దీప కళికతో అణచివేసి, ఇహలోక సౌఖ్యాలను వదలివేసి, సత్పురుషులు నీ సన్నిధిని కోరుతున్నారు. అలా కాకుండా అధికార మనే అంధకారంలో మునిగి నీ తత్వం తెలుసుకోలేక, నిన్ను పూజించని వారు సంసారచక్రంలో పరిభ్రమిస్తూ ఉంటారు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=26&Padyam=249

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...