Wednesday, 16 June 2021

శ్రీకృష్ణ విజయము - 259

( రుక్మిణిదేవి స్తుతించుట )

10.2-257-సీ.
నీరదాగమమేఘనిర్యత్పయః పాన-
  చాతకం బేగునే చౌటి పడెకుఁ?
బరిపక్వ మాకంద ఫలరసంబులు గ్రోలు-
  కీరంబు సనునె దుత్తూరములకు?
ఘనర వాకర్ణనోత్కలిక మయూరము-
  గోరునే కఠిన ఝిల్లీరవంబుఁ?
గరికుంభ పిశిత సద్గ్రాస మోదిత సింహ-
  మరుగునే శునక మాంసాభిలాషఁ
10.2-257.1-తే.
బ్రవిమలాకార! భవదీయ పాదపద్మ
యుగ సమాశ్రయ నైపుణోద్యోగచిత్త
మన్యుఁ జేరునె తన కుపాస్యంబు గాఁగ?
భక్తమందార! దుర్భర భవవిదూర!
10.2-258-క.
వాసవవందిత! భవ కమ
లాసన దివ్యప్రభా సభావలి కెపుడున్
నీ సమధిక చారిత్ర క
థా సురుచిరగాన మవితథం బయి చెల్లున్.

భావము:
ఓ భవ దురా! శుభాకారా! ఓ భక్తమందారా! వర్షాకాలంలో మేఘంనుండి వెలువడే జల బిందువులను, ఆస్వాదించే చాతకపక్షి చవిటిగుంట లోని నీటి కోసం వెళుతుందా? పండిన మామిడిపండ్ల రసాన్ని గ్రోలే చిలుక, ఉమ్మెత్తలను ఆశ్రయిస్తుందా? నీలమేఘ గర్జనాన్ని విని ఆనందించే నెమలి, ఈల పురుగు ధ్వనిని కోరుకుంటుందా? ఏనుగు కుంభస్థలం లోని మాంసాన్ని భుజించే సింహం, కుక్కమాంసం కోసం కక్కుర్తిపడుతుందా? ఈ నీ పాదపద్మ ద్వయాన్ని కోరి ఆశ్రయించి ఆనందించే హృదయం మరొక దానిని ఎందుకు అభిలషిస్తుంది? దేవేంద్రునిచేత స్తుతింపబడు ఓ దేవాధిదేవా! కైలాసంలోనూ సత్యలోకంలోనూ ఎప్పుడూ నీ దివ్యగాథలే కమ్మగా గానం చేయబడుతూ ఉంటాయి.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=26&Padyam=258

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...