Tuesday, 22 June 2021

శ్రీకృష్ణ విజయము - 264

( రుక్మిణీదేవి నూరడించుట )

10.2-268-వ.
అని వెండియు నిట్లనియె “నీవాక్యంబులు శ్రవణసుఖంబుగావించె; నీవు వివిధంబులైన కామంబులు గోరితివేని, నవియన్నియు నాయంద యుండుటం జేసి యేకాంతసేవాచతుర వైన నీకు నవి యన్నియు నిత్యంబులై యుండు; నీ పాతివ్రత్యంబును, నా యందలి స్నేహంబు నతివిశదంబు లయ్యె; నావాక్యములచేత భవ దీయచిత్తంబు చంచలంబు గాక నా యందలి బుద్ధి దృఢంబగుం గావున సకలసంపద్విలసితంబైన ద్వారకానగర దివ్యమందిరంబు లందు నీదు భాగ్యంబునం జేసి సంసారికైవడి నీ యందు బద్ధానురాగుండనై వర్తింతుఁ; దక్కిన ప్రాణేంద్రియ పరవశత్వంబున వికృత శరీరధారిణియైన సతి నన్నుం జెందుట దుష్కరం; బదియునుం గాక మోక్షప్రదుండనైన నన్నుఁ గామాతురలైన యల్పమతులు వ్రతతపోమహిమలచేత దాంపత్య యోగంబుకై సేవింతు; రదియంతయు నా మాయా విజృంభితంబు; దానంజేసి వారు మందభాగ్యలై నిరయంబు నొందుదు; రట్లుగావున నీ సమానయైన కాంత యే కాంతలందైనఁ గలదె? నీ వివాహకాలంబు ననేక రాజన్యవర్యులఁ గైకొనక భవదీయ మధురాలాప శ్రవణాత్మకుండనైన నా సన్నిధికి "నా శరీరం బితర యోగ్యంబు గాదు; నీకు శేషంబనయి యున్న దాన" నని యేకాంతంబునం బ్రాహ్మణుం బుత్తెంచిన నేనును జనుదెంచి, నీ పరిణయసమయంబున భవత్సహోదరుంబట్టి విరూపుం గావించిన నది గనుంగొనియును నా యందలి విప్రయోగ భయంబున నూరకుండితి; వదిగావున బహుప్రకారంబులై వర్తించు నీ సద్గుణంబులకు సంతసింతు!”నని యివ్విధంబున దేవకీసుతుండు నరలోక విడంబనంబుగ గృహస్థునిభంగి నిజగృహకృత్యంబు లాచరించుచుండె"నని శుకుండు మఱియు నిట్లనియె.

భావము:
నీ పలుకులు నాకు శ్రవణానందాన్ని కలిగించాయి. నీవు ఏవి కోరినా అవన్నీ, నా వద్దే ఉన్నాయి కనుక, ఏకాంతసేవాచతుర వైన నీకు అవన్నీ లభిస్తాయి. నీ పాతివ్రత్యమూ, నా మీది ప్రేమా స్పష్టమయ్యాయి. నా మాటలచేత నీమనస్సు సంచలించకుండా, నా మీది నీ అనురాగం ఇంకా ధృడమవుతుంది. కాబట్టి సమస్త భోగభాగ్యాలతో నిండిన ఈ ద్వారకానగర దివ్యమందిరాలలో కేవలం ఒక గృహస్థు లాగా నీ మీద బద్ధానురాగంతో ప్రవర్తిస్తాను. ఇదంతా నీ అదృష్టం. ఏ ఇంద్రియలోలురాలైన వికృత స్వరూపిణికి అయినా నన్ను పొందడం దుష్కరం. అంతే కాదు మోక్షదాయకుడ నైన నన్ను కామాతురా లైన అల్పబుద్ధులు వ్రతాలతో, తపస్సుతో, దాంపత్య జీవితం కోసం సేవిస్తుంటారు. ఆ భావం నా మాయవలన విజృంభించిందే. అందువలన వారు భాగ్యవిహీనలై నరకాన్ని పొందుతారు. నీతో సమానమైన స్త్రీ ఈ లోకంలో లేదు. నీవు వివాహకాలంలో ఎందరినో గొప్ప గొప్ప రాజన్యులను తిరస్కరించావు. ”నేను నీదానను. ఈ నా దేహం మీద అన్యులెవ్వరికీ అధికారం లేదు.” అంటూ బ్రాహ్మణుని నా దగ్గరకు పంపించావు. నేను నీ ఆహ్వానం మన్నించి వచ్చి, నిన్ను వివాహమాడే సందర్భంలో నీ సోదరుడిని వికారస్వరూపుడిగా కావించాను. అది చూసి కూడా నా వియోగాన్ని సహింపలేక ఊరుకున్నావు. ఇటువంటి నీ సద్గుణాలకు ఎంతో సంతోషించాను.” అని ఈవిధంగా ఆమెను అనునయించాడు. ఈ మాదిరి, దేవకీతనయుడు శ్రీకృష్ణుడు మానవలోక ధర్మాన్ని అనుసరించి, గృహస్థువలెనే తన గృహకృత్యాలను ఆచరిస్తున్నా” డని శుకుడు తెలిపి పరీక్షిత్తుతో ఇంకా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=27&Padyam=268

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :


No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...