Sunday, 8 August 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౪ (304)

( నారదుని ద్వారకాగమనంబు )

10.2-601-వ.
మఱియును, సముత్తుంగమణిసౌధగవాక్షరంధ్ర నిర్గత నీరంధ్ర ఘనసార చందనాగరు ధూపధూమపటల విలోకన సంజనిత పయోధరాభిశంకాంగీకృత తాండవకేళీవిలోల పురకామినీజనోప లాలిత నీలకంఠ సముదయంబును, జంద్రకాంతమణిస్ఫటికస్తంభ సంభృత మరకత పద్మరాగఘటిత నవరత్న కాంచనప్రాసాదశిఖరాగ్ర విన్యస్త బహుసూర్య విభ్రమకృదంచిత శాతకుంభకుంభ నిచయంబును, సమస్తవస్తువిస్తార సమర్పిత వైశ్యాగారవీథీవేదికా కలితంబును, మహితాతపనివారణ తరళవిచిత్రకేతనాబద్ధ మయూరశింజినీ నినదపూరితాశాంతరిక్షంబును, సరోజనాభ పూతనాచేతనాపహారాది నూతనవిజయసందేశలిఖిత స్వర్ణ వర్ణావళీవిభాసిత గోపురమణివిటంకప్రదేశంబును, యాదవేంద్ర దర్శనోత్సవాహూయమాన సమాగతనానాదేశాధీశభూరివారణ దానజల ప్రభూతపంకనిరసనైక గతాగత జనసమ్మర్ద కరకంకణ కర్షణ వికీర్యమాణ రజఃపుంజంబును; వినూత్న రత్నమయ మంగళరంగవల్లీ విరాజిత ప్రతిగృహప్రాంగణంబును, గుంకుమ సలిలసిక్త విపణిమార్గంబును, వందిమాగధసంగీతమంగళారావ విలసితంబును, భేరీ మృదంగ కాహళ శంఖ తూర్యరవాధరీకృత సాగరఘోషంబునునై, యమరావతీపురంబునుం బోలె వసుదేవ నందననివాసంబై, యనల పుటభేదనంబునుం బోలెఁ గృష్ణమార్గ సంచారభూతంబై, సంయమనీనామ నగరంబునుం బోలె హరి తనూభవాభిరామంబై, నైరృతినిలయంబునుం బోలెఁ బుణ్యజనాకీర్ణంబై, వరుణనివాసంబునుఁ బోలె గోత్రరక్షణభువనప్రశస్తంబై, ప్రభంజనపట్టణంబునుం బోలె మహాబలసమృద్ధంబై, యలకాపురంబునుం బోలె ముకుంద వర శంఖ మకరాంక కలితంబయి, రజతాచలంబునుం బోలె నుగ్రసేనాధిపార్యాలంకృతంబయి, నిగమంబునుం బోలె వివిధవర్ణక్రమవిధ్యుక్త సంచారంబయి, గ్రహమండలంబునుం బోలె గురుబుధకవిరాజమిత్ర విరాజితంబయి, సంతతకల్యాణవేదియుం బోలె వైవాహికోపేతంబయి, బలిదానవ కరతలంబునుం బోలె సంతతదానవారియుక్తంబయి, యొప్పు నప్పురంబు ప్రవేశించి, యందు విశ్వకర్మనిర్మితంబైన యంతఃపురంబున నుండు షోడశసహస్ర హర్మ్యంబులందు.

భావము:
ఆ ద్వారకానగరంలో చాలా ఎత్తైన మేడలు ఉన్నాయి. ఆ సౌధాల కిటికీలలో నుంచి అగరు ధూపధూమాలు వెలువడుతున్నాయి. ఆ నల్లని పొగలను మేఘాలని భ్రమించి, అచ్చటి కాంతామణులు ఎంతో అనురాగంతో లాలిస్తున్న నెమళ్ళు తాండవం చేస్తున్నాయి. ఆ పట్టణంలో చంద్రకాంతమణులు చెక్కిన స్ఫటిక స్తంభాలతో కూడిన నవరత్న ప్రాసాదాలు ఉన్నాయి. ఆ ప్రాసాద శిఖరాల మీద బంగారుకలశాలు అమర్చి ఉన్నాయి ఆ కలశాల మీద ప్రసరించిన సూర్యకిరణాలు వేలకొలది సూర్యబింబాలను సృష్టిస్తున్నాయి. ఆ పట్టణంలో సమస్త వస్తువులతో కలకల లాడుతున్న విపణివీధులు ఉన్నాయి. ఆ పట్టణంలో ఆకాశాన్ని అంటుతూ, ఎగురుతున్న చిత్రవిచిత్రమైన జెండా గుడ్డలు ఎండ తగలకుండా అడ్డుపడుతున్నాయి. గోపాల కృష్ణుడు బాలుడుగా చేసిన పూతన సంహారం మొదలైన వీరగాథలు బంగారు అక్షరాలతో చెక్కిన ఫలకాలు గోపురాలపై విరాజిల్లుతున్నాయి. నందనందనుని సందర్శన కోసం వచ్చిన నానాదేశాల రాజులు కానుకలుగా తెచ్చిన ఏనుగుల మదధారలతో తడిసిన ప్రదేశాలను వచ్చేపోయే వారి కరకంకణాల ఒరిపిడి వలన రాలిపడిన బంగారు రజను పొడిపొడిగా మారుస్తున్నాయి. ప్రతి ఇంటి ముందూ కొంగ్రొత్త రత్నాలతో ముద్దుముద్దుగా తీర్చిదిద్దిన ముత్యాలముగ్గులు అలరారుతున్నాయి. ఆ పట్టణం పన్నీరు చల్లిన వీధులతోనూ వందిమాగధుల సంగీత మంగళారావాలతోనూ సముద్రఘోషాన్ని సైతం క్రిందుపరచే భేరీ, మృదంగ, కాహళాది తూర్య ధ్వనులతోనూ నిండి ఉన్నది. అష్టదిక్పాలుర పట్టణాలను తలపించే ఆ ద్వారకాపట్టణాన్ని నారదుడు ప్రవేశించి అక్కడ విశ్వకర్మ చేత నిర్మించబడ్డ అంతఃపురంలోని పదహారువేల సౌధాలలోనూ శ్రీకృష్ణుడిని దర్శించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=50&Padyam=601

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...