Tuesday, 10 August 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౬(306)

( నారదుని ద్వారకాగమనంబు )

10.2-605-వ.
మఱియు హాటకనిష్కంబు లఱ్ఱులందు వెలుగొందఁ గంచుకంబులు శిరోవేష్టనంబులుఁ గనకకుండలంబులు ధరించి, సంచరించు కంచుకులును, సమాన వయోరూపగుణవిలాసవిభ్రమ కలితలయిన విలాసినీ సహస్రంబులును గొలువం గొలువున్న యప్పద్మలోచనుం గాంచన సింహాసనాసీనుం గాంచె; నప్పుండరీకాక్షుండును నారదుం జూచి ప్రత్యుత్థానంబు సేసి యప్పుడు.
10.2-606-క.
మునివరు పాదాంబుజములు
దన చారుకిరీటమణి వితానము సోఁకన్
వినమితుఁడై నిజసింహా
సనమునఁ గూర్చుండఁ బెట్టి సద్వినయమునన్.
10.2-607-క.
తన పాదకమలతీర్థం
బున లోకములం బవిత్రముగఁ జేయు పురా
తనమౌని లోకగురుఁ డ
మ్ముని పదతీర్థంబు మస్తమున ధరియించెన్.

భావము:
మెడలో ప్రకాశించే బంగారు పతకాలతో; కంచుకాలూ తలపాగాలూ కుండలాలూ ధరించి సంచరించే కంచుకి జనము; సరియైన వయో, రూప, గుణాలతో విలసిలిల్లే వేలాది లీలావతులు సేవిస్తూ ఉండగా, బంగారు సింహాసనంమీద కొలువుతీరి కూర్చున్న పద్మాక్షుడు శ్రీకృష్ణుడిని ఆ మహర్షి తిలకించాడు. తన వద్దకు వస్తున్న నారదమునిని చూసి గోపవల్లభుడు ఎదురు వచ్చాడు. శ్రీకృష్ణుడు తన కిరీటంలోని మణుల సమూహం మునిశ్రేష్ఠుడైన నారదుని పాదపద్మాలకు తాకేలా నమస్కారం చేసి, తన సింహాసనం మీద కూర్చోపెట్టి, చక్కటి వినయంతో తన పాదకమలతీర్థంచేత సర్వలోకాలనూ పవిత్రం చేసే, ప్రాచీనమునీ, లోకగురుడూ అయిన శ్రీకృష్ణుడు నారదుడి పాదతీర్థం తన తల మీద ధరించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=50&Padyam=607

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...