Thursday, 12 August 2021

శ్రీకృష్ణ విజయము - ౩౦౮(308)

( షోడశసహస్ర స్త్రీ సంగతంబు )

10.2-612-వ.
అని యభ్యర్థించి యద్దేవునివలనం బ్రసన్నత వడసి, తన్మందిరంబు వెడలి మునివరుం డమ్మహాత్ముని యోగమాయాప్రభావంబు దెలియంగోరి, వేఱొక చంద్రబింబాననాగేహంబునకుం జని యందు నెత్తమాడుచున్న పురుషోత్తము నుద్ధవ యుతుం గని యద్భుతంబు నొందుచు నతనిచేత సత్కృతుండై యచ్చోట వాసి చని.
10.2-613-క.
మునివరుఁడు కాంచె నొండొక
వనజాయతనేత్ర నిజనివాసంబున నం
దనయుతు జిష్ణు సహిష్ణున్
వినుతగుణాలంకరిష్ణు విష్ణుం గృష్ణున్.
10.2-614-క.
నారదుఁ డట చని కనె నొక
వారిజముఖియింట నున్నవాని మురారిన్
హారిన్ దానవకుల సం
హారిం గమలామనోవిహారిన్ శౌరిన్.

భావము:
ఆ విధంగా ప్రార్థించి నారదుడు శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందాడు. ఆ మందిరం నుంచి బయటకు వచ్చిన ఆ దేవర్షి వాసుదేవుడి యోగమాయా ప్రభావం తెలుసుకోదలచాడు. వేరొక వాల్గంటి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఉద్ధవునితో కలసి జూదమాడుతూ ఉన్న శ్రీకృష్ణుడిని తిలకించి ఆశ్చర్యచకితుడు అయ్యాడు. అక్కడ కృష్ణుడిచేత పూజించబడి ఆ భవనం నుండి బయటకు వెళ్ళాడు. నారదుడు మరింకొక సుందరి మందిరానికి వెళ్ళాడు. అక్కడ నందనులతో కలసి ఆనందిస్తున్న కలువ కన్నుల కన్నయ్యను సందర్శించాడు. నారదముని వేరొక పద్మాక్షి సౌధానికి వెళ్ళి అక్కడ ఉన్న దానవాంతకుడు అయిన కృష్ణుడిని దర్శించాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=51&Padyam=614

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...