Saturday, 14 August 2021

శ్రీకృష్ణ విజయము - ౩౧౦(310)

( షోడశసహస్ర స్త్రీ సంగతంబు )

10.2-618-వ.
మఱియుం జనిచని.
10.2-619-సీ.
ఒకచోట నుచితసంధ్యోపాపనాసక్తు-
  నొకచోటఁ బౌరాణికోక్తికలితు
నొకచోటఁ బంచయజ్ఞోచితకర్ముని-
  నొకచోట నమృతోపయోగలోలు
నొకచోట మజ్జనోద్యోగానుషక్తుని-
  నొకచోట దివ్యభూషోజ్జ్వలాంగు
నొకచోట ధేనుదానోత్కలితాత్ముని-
  నొకచోట నిజసుతప్రకరయుక్తు
10.2-619.1-తే.
నొక్క చోటను సంగీతయుక్త చిత్తు
నొక్కచోటను జలకేళియుతవిహారు
నొక్కచోటను సన్మంచకోపయుక్తు
నొక్కచోటను బలభద్రయుక్తచరితు.
10.2-620-వ.
మఱియును.
10.2-621-సీ.
సకలార్థసంవేది యొ యింటిలోపలఁ-
  జెలితోడ ముచ్చటల్‌ సెప్పుచుండు
విపులయశోనిధి వేఱొక యింటిలో-
  సరసిజాననఁ గూడి సరస మాడుఁ
బుండరీకదళాక్షుఁ డొండొక యింటిలోఁ-
  దరుణికి హారవల్లరులు గ్రుచ్చుఁ
గరుణాపయోనిధి మఱియొక యింటిలోఁ-
  జెలిఁ గూడి విడియము సేయుచుండు
10.2-621.1-ఆ.
వికచకమలనయనుఁ డొకయింటిలో నవ్వు
బ్రవిమలాత్ముఁ డొకటఁ బాడుచుండు
యోగిజనవిధేయుఁ డొకయింట సుఖగోష్ఠి
సలుపు ననఘుఁ డొకటఁ జెలఁగుచుండు.
10.2-622-వ.
ఇట్లు సూచుచుం జనిచని.

భావము:
ఇలా చూస్తూ నారదుడు ఇంకా ముందుకు వెళ్ళాడు.
ఒక ఇంటిలో సంధ్యావందనం చేస్తూ ఉన్న వాడిని; మరొక గృహంలో పురాణశ్రవణం చేస్తూ ఉన్న వాడిని; ఒక చోట పంచయజ్ఞాలు ఆచరిస్తున్నవాడిని; మరొక తావున యోగసమాధి నిమగ్నమై ఉన్న వాడిని; ఒక స్థలంలో స్నానానికి సిద్ధమవుతూ ఉన్న వాడిని; ఇంకొక చోట ప్రశస్త భూషణాలతో ప్రకాశిస్తున్న వాడిని; మరొక ప్రదేశంలో గోదానం చేయాలని కుతూహలపడుతూ ఉన్న వాడిని; ఇంకొక ప్రదేశంలో తన కుమారులతో ఆడుకుంటున్న వాడినీ; ఒకచోట సంగీతం మీద ఆసక్తిని చూపుతున్న వాడిని; మరొక చోట జలకేళి ఆడుతున్నవాడిని; ఇంకొక చోట మంచం మీద కుర్చున్న వాడిని; మరొకచోట బలరాముడి తో కలిసి ఉన్న వాడిని, యిలా పలుస్థలములలో పలుక్రియలలో నిమగ్నుడై యున్న శ్రీకృష్ణుడిని నారదమహర్షి సందర్శించాడు. శ్రీకృష్ణుడు తన ముద్దులసఖితో ఒక ఇంటిలో ముచ్చటలు ఆడుతున్నాడు; మరో ఇంటిలో మరొక ప్రియసఖితో సరసమాడుతున్నాడు; ఇంకో ఇంటిలో ఒక స్త్రీ రత్నం కోసం హారాలు గుచ్చుతున్నాడు; ఒక ఇంటిలో తన యువతితో కలిసి తాంబూలం సేవిస్తున్నాడు; ఒక ఇంటిలో నవ్వుతున్నాడు; ఒక ఇంటిలో పాడుతున్నాడు; ఒక ఇంటిలో సుఖగోష్టి చేస్తున్నాడు; ఒక ఇంటిలో ఆనందిస్తున్నాడు; ఈ మాదిరి అనేక రూపాలతో కనపడుతూ ఉన్న ఆ సకలార్థసంవేదిని, ఆ వికచకమల నయనుని, ఆ విమలాత్ముని, ఆ యోగిజన విధేయుని, ఆ శ్రీకృష్ణభగవానుడిని దర్శిస్తూ నారదుడు ముందుకు సాగిపోయాడు. ఈ విధంగా పరిశీలిస్తూ సాగిపోతూ....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=51&Padyam=621

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...