Saturday 1 October 2022

శ్రీకృష్ణ విజయము - ౬౪౩(643)

( కృష్ణుని భార్యా సహస్ర విహారంబు ) 

10.2-1333-వ.
అట్టి యన్వయంబు నందు మాధవునకు రుక్మిణీదేవి యందుఁ బితృసముండును, సమగ్ర భుజావిజృంభణుండును నై ప్రద్యుమ్నుండు జనియించె; నతనికి రుక్మికూఁతురగు శుభాంగివలన ననిరుద్ధం డుదయించె; నతనికి మౌసలావశిష్టుండైన ప్రజుండు సంభవించె; నతనికిఁ బ్రతిబాహుండుపుట్టె; వానికి సుబాహుండు జన్మించె; నతనికి నుగ్రసేనుండుప్రభవించె; నతనికి శ్రుతసేనుండు గలిగె; నిట్లు యదు వృష్టి భోజాంధక వంశంబులు పరమ పవిత్రంబులై పుండరీకాక్షుని కటాక్షవీక్షణ శయ్యాసనానుగత సరసాలాప స్నానాశన క్రీడావినోదంబుల ననిశంబునుం జెందుచు, సర్వదేవతార్థంబు సమస్తంబైన క్రతువు లొనరింపుచుఁ బరమానంద కందళిత చిత్తులై యుండి" రని చెప్పి వెండియు.

భావము:
అలాంటి వంశంలో శ్రీకృష్ణునికి రుక్మిణివల్ల ప్రద్యుమ్నుడు పుట్టాడు. అతడు అన్నిటా తండ్రి వంటివాడు మహాభుజబలం కలవాడు అతని భార్య రుక్మి కూతురు శుభాంగి. ఆమెకు అనిరుద్ధుడు జన్మించాడు. అతనికి ప్రజుడు పుట్టాడు. ఇతను మాత్రమే ముసలం బారినుండి తప్పించుకున్నాడు. ఆ ప్రజుడికి ప్రతిబాహుడు, ప్రతిబాహుడికి సుబాహుడు పుట్టారు. అతనికి ఉగ్రసేనుడు జన్మించాడు. ఈ విధంగా యదు, వృష్ణి, భోజ, అంధక, వంశాలు పవిత్రాలు అయ్యాయి. కృష్ణుడితో సహవాసంచేస్తూ ఆయన కటాక్షవీక్షణలు అందుకుంటు, ఆయనతో కంచాలు మంచాలు ఆసనాలు పంచుకుంటు, కలిసి స్నానాలు భోజనాలు చేస్తు, వినోదాలలో పాల్గొంటు, సకల దేవతలను ఉద్దేశించి యాగాలు చేస్తూ యాదవులు పరమానందం పొందుతూ జీవించారు.” అని చెప్పిన శుకమహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=88&Padyam=1333

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : 

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...