Monday 26 December 2022

శ్రీకృష్ణ విజయము - ౭౦౪(704)

( అవధూత సంభాషణ ) 

11-97-వ.
ఇందుల కొక్క యితిహాసంబు గలదు; మహారణ్యంబున నొక్క కపోతంబు దారసమేతంగా నొక్క నికేతనంబు నిర్మించి యన్యోన్య మోహాతిరేకంబునఁ గొంతకాలంబునకు సంతానసమృద్ధిగలదియై యపరిమితంబు లయిన పిల్లలు దిరుగాడుచుండఁ గొన్ని మాసంబులు భోగానుభవంబునం బొరలుచుండఁ గాలవశంబున నొక్క లుబ్ధకుం డురు లొడ్డిన నందు దారాపత్యంబులు దగులువడిన ధైర్యంబు వదలి మోహాతిరేకంబునం గపోతంబు కళత్ర పుత్త్ర స్నేహంబునం దాను నందుఁజొచ్చి యధికచింతాభరంబునం గృశీభూతంబయ్యెఁ; గావున నతితీవ్రంబయిన మోహంబు గొఱగా దట్లు గాన నిరంతర హరిధ్యానపరుండై భూమి పవన గగన జల కృపీట భవ సోమ సూర్య కపోత తిలిప్స జలధి శలభ ద్విరేఫ గజ మధు మక్షికా హరిణ పాఠీన పింగళా కురర డింభక కుమారికా శరకృ త్సర్ప లూతా సుపేశకృత్సముదయంబులు మొదలుగాఁ గలవాని గుణగణంబు లెఱింగికొని యోగీంద్రులు మెలంగుదు; ”రనిన.

భావము:
దీనికి ఒక ఇతిహాసము ఉంది. చెప్తా విను. ఒక పెద్ద అడవిలో ఒక పావురం భార్యతో కలసి ఒక నివాసాన్ని ఏర్పరచుకుంది. ఆ కపోత దంపతులు ఒకరి మీద ఒకరు చాలా మోహంతో ఉండేవారు. కొంతకాలానికి వాటికి సమృద్ధిగా సంతానం కలిగింది. పిల్లలన్నీ అటుఇటూ తిరుగుతూ ఉంటే సంతోషంతో ఆ భోగానుభవంతో కొన్నినెలలు గడిచాయి. ఇలా ఉండగా, ఒకనాడు కాలవశాన ఒక బోయ వచ్చి వల వేశాడు. ఆ వలలో ఆడపావురము పిల్లలు చిక్కుకున్నాయి. మగపావురం ధైర్యం వదలి మోహంతో భార్యా బిడ్డలమీద స్నేహంతో తాను కూడా ఆ వలలో ప్రవేశించి విచారంతో కృశించి నశించి పోయింది. కాబట్టి, దేని యందు మరీ తీవ్రమయిన మోహం మంచిది కాదు.
అందుకనే యోగీంద్రులు ఎప్పుడు హరిధ్యానంపై ఆసక్తి కలిగి ఉంటారు. భూమి, గాలి, ఆకాశం, నీరు, అగ్ని, చంద్రుడు, సూర్యుడు, పావురం, కొండచిలువ, సముద్రం, మిడుత, తుమ్మెద, ఏనుగు, తేనెటీగ, లేడి, తాబేలు, ముంగిస, లకుమికిపిట్ట, బాలుడు, బాలిక, బాణాలు చేసేవాడు, పాము, సాలీడు, కందిరీగ (ఇరవై నాలుగు) మొదలగు వాటి గుణగణాలు తెలుసుకుని మెలగుతూ ఉంటారు.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=11&Ghatta=17&Padyam=97

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : : ..

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...