Saturday 27 September 2014

శ్రీ చంద్రఘంటా దేవీ

చంద్రఘంట: (ఆశ్వీయుజ శుద్ధ తృతీయ)

పిండజప్రవరారూఢా చండకోపాస్త్రకైర్యుతా ।
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ॥

దుర్గామాత మూడో శక్తి అవతారం. ఈమె తన శిరస్సున దాల్చిన అర్థచంద్రుడు ఘంటాకృతిలో ఉండడం వలన చంద్రఘంట
అనే పేరు వచ్చింది. శరీర కాంతి బంగారం మాదిరి మిలమిలలాడుతుండగా తన పది చేతులలో ఖడ్గము మొదలయినటువంటి శస్త్రాలు, బాణం తదితర అస్త్రాలు ధరించి ఉంటుంది. సింహంపై కూర్చుని యుద్ధానికి సర్వదా సిద్ధంగా ఉంటుంది. చంద్రఘంట గంట నుంచి వెలువడే శబ్ద తరంగాలు శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే
మాదిరి ఉంటాయి. చంద్రఘంట మాత కటాక్షం వల్ల భక్తులు, ఉపాసకుల బాధలు, పాపాలు, కష్టాలు తొలగిపోతాయి. దర్శన
మాత్రం చేత ఒక అలౌకికమయిన ప్రశాంతత చేకూరుతుంది.

నవరాత్రి దుర్గాపూజలలో మూడవ రోజు సేవ మిక్కిలి మహిమోపేతమైనది. ఆ రోజు సాధకుని మనస్సు మణిపూరక చక్రాన్ని ప్రవేశిస్తుంది. చంద్రఘంటాదేవి కృపవలన ఉపాసకునికి దివ్య వస్తు సందర్శనం కలుగుతుందని చెబుతారు. దివ్య సుగంధ అనుభవము కూడా సిద్ధిస్తుంది. అలాగే
వివిధాలైన దివ్యధ్వనులు కూడా వినిపిస్తాయి. ఈ దివ్యానుభవ అనుభూతి కొరకు, సాధకుడు సావధానుడై ఉండాలి.

ఈ మాత కృపవలన సాధకుని సమస్త పాపాలూ, బాధలూ తొలగిపోతాయి. ఈమె ఆరాధన సద్యః ఫలదాయకము. ఈమె
నిరంతరమూ యుద్దసన్నద్ధురాలై
ఉన్నట్లు దర్శనమిస్తుంది కనుక భక్తుల కష్టాలను అతి శీఘ్రముగా నివారిస్తుంది. ఈ
సింహవాహనను ఉపాసించేవారు సింహసదృశులై పరాక్రమశాలురుగా నిర్భయులుగా ఉంటారు. ఈమె
ఘాంటానాదము సంతతము భక్తులను భూతప్రేతాది బాధలనుండి కాపాడుతూ ఉంటుంది. ఈమెను సేవించినంతనే
శరణాగతుల రక్షణకై అభయఘంట ధ్వనిస్తూ ఉంటుంది.

దేవి ధ్యానము మనకు ఇహపర లోకాలలో పరమ కల్యాణదాయకమై సద్గతులను ప్రాప్తింపజేస్తుంది... చంద్రఘంట నమోస్తుతే!!!

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...