రాగం - శ్రీ
తాళం - ఆది
పల్లవి:
ఎందరో మహానుభావు లందరికి వందనము
॥ఎందరో॥
అనుపల్లవి:
చందురు వర్ణుని యందచందమును హృదయార
విందమున జూచి బ్రహ్మానంద మనుభవించువా
॥రెందరో॥
చరణాలు:
సామగానలోల మనసిజ లావణ్య ధన్యమూర్ధ న్యు
॥లెందరో॥
మానసవనచర వరసంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనేవా
॥రెందరో॥
సరగున బాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము సేయువా ॥రెందరో॥
పతితపావనుడనే పరాత్పరుని గురించి బరమార్థమగు నిజమార్గముతోను బాడుచును, సల్లాపముతో స్వరలయాది రాగముల తెలియువా ॥రెందరో॥
హరి గుణమణులగు సరములు గళమున శోభిల్లు భక్తకోటు లిలలో తెలివితో చెలిమితో గరుణగల్గి జగమెల్లను సుధాదృష్టిచే బ్రోచువా ॥రెందరో॥
హోయలుమీఱ నడులుగల్గు సరసుని సదా గనుల జూచుచును, పులకశరీరులయి ఆనంద పయోధి
నిమగ్నులయి ముదంబునను యశముగలవా
॥రెందరో॥
పరమభాగవత మౌనివరశశివిభాకర సనక సనందన దిగీశ సురకింపురుష కనక కశిపుసుత నారద తుంబురు పవనసూను బాలచంద్రధర శుకసరోజభవ భూసురవరులు పరమపావనులు ఘనులు శాశ్వతులు కమలభవసుఖము సదానుభవులుగాక
॥రెందరో॥
నీ మేను నామ వైభవమ్ములను నీ పరాక్రమ ధైర్యముల శాంత మా నసము నీవులను వచన సత్యమును రఘువర నీయెడ సద్భక్తియు జనించకను దుర్మతములను కల్ల జేసినట్టి నీమది నెఱింగి సతతంబునను గుణభజనానంద కీర్తనము జేయువా
॥రెందరో॥
భాగవత రామాయణ గీతాది శ్రుతిశాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గూఢముల ముప్పదిముక్కోటి సురాంత రంగముల భావముల నెఱిగి భావరాగ లయాది సౌఖ్యముచే జిరాయువుల్ గలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైనవా
॥రెందరో॥
ప్రేమ ముప్పిరిగొను వేళ నామము దలచేవారు
రామభక్తుడైన త్యాగరాజ నుతుని నిజదాసులైనవా
॥రెందరో॥
No comments:
Post a Comment