హోళీ: (06 - 03 - 2015, ఫాల్గుణ పౌర్ణిమ)
హోళీ అద్భుతమైన రంగుల పండుగ... విశ్వవ్యాప్యంగా హోళీ పండుగను ప్రతీ యేటా ఫాల్గుణ పౌర్ణమి రోజున వైభవంగా జరుపుకుంటారు. వసంతోత్సవము, దులాండి, ధూల్ జాత్రా మొదలైన పేర్లతో వివిధ ప్రాంతాల్లో ఈ పండుగను జరుపుకుంటారు...
పురాణ కథనం:
ఈ పండుగ ఈనాటిది కాదు. ద్వాపర యుగంలోనే ఈ పండుగ జరుపుకున్నట్లు చారిత్రిక ఆధారాలున్నాయి. రాధాదేవి తనకంటే తెల్లగా ఉంటుందని, తనది నలుపని కృష్ణుడు తల్లి యశోద దగ్గర వాపోతాడు. అప్పుడు యశోద కృష్ణుడికి ఓ సలహా ఇస్తుంది. రాధ శరీరం నిండా రంగులు పూయమని కిట్టయ్యకు ఓ ఉపాయం చెబుతుంది. తల్లి సలహా మేరకు ఆ పరంధాముడు రాధను పట్టుకుని ఆమెమీద రంగులు కలిపిన నీటిని కుమ్మరిస్తాడు. దానికి ప్రతిగా రాధ కూడా కృష్ణుడిమీద వసంతం కుమ్మరిస్తుంది. అప్పటి నుంచి స్నేహితులు, బంధువులు, ప్రేమికులు ఒకరిమీద మరొకరు రంగులు చల్లుకోవడం ప్రారంభమయింది.
కాముని దహనం హోళీ పండుగ ముందురోజు కాముని దహనం చేస్తారు. హిరణ్యాకశపుని సోదరి పేరు హోళిక. ఆమె మంటల్లో తన శరీరం కాలకుండా బ్రహ్మ వల్ల వరం సంపాదించింది. పరమ విష్ణుభక్తుడైన ప్రహ్లాదుడిని ఎలాగైనా సంహరించాలన్న అన్న ఆజ్ఞ వలన ఇంట్లోనే మంటలు రగిల్చి అందులోకి ప్రహ్లాదుడిని తోసే ప్రయత్నం చేస్తుంది. ఆ మంటలు ప్రహ్లాదుని ఏమీ చేయకుండా, హోళికను మాత్రం దహించి వేస్తాయి. అలా చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా హోళీ అనే పేరు వచ్చింది.
కాముని దహనానికి ఆ పేరు ఎలా వచ్చింది ?
ఓ సమయంలో ధ్యాన నిష్టలో ఉన్న శివునిపై మన్మథుడు పూలబాణాలు వేసి తపోభంగం కలిగిస్తాడు. తన తపస్సు భగ్నం చేసినందుకు శివుడు మన్మథుడిపై ఆగ్రహించి, తన త్రినేత్రంతో కాముడిని అంటే మన్మథుడిని భస్మం చేస్తాడు. తర్వాత రతీదేవి మొర ఆలకించిన శివుడు శాంతించి మన్మథుడిని తిరిగి బ్రతికిస్తాడు. దానికి గుర్తుగానే హోళీ పున్నమికి ముందు కాముని దహనం చేస్తారు. ఇక్కడ కామం అంటే కోరిక, వాంఛ అనే అర్థాలు కూడా చెప్పుకుంటారు.
ఎందుకు రంగులు చల్లుకోవాలి....?
వసంత కాలంలో వాతవరణములో మార్పులు జరగటం వల్ల వైరల్ జ్వరం మరియు జలుబు వస్తాయి. అందుకని, సహజమైన రంగు పొడులను చల్లుకోవడం వల్ల ఔషధముగా పనిచేస్తుందని అర్థం. సంప్రదాయముగా రంగులను నిమ్మ , కుంకుమ, పసుపు, బిల్వ మరియు మోదుగలను ఉపయోగించి తయారు చేస్తారు.
కానీ నేడు సంప్రదాయ రంగులకు బదులుగా రసాయనిక రంగులు చల్లుకోవడం పరిపాటిగా మారింది. దీనివలన అనేక రకాల చర్మ వ్యాధులు, క్యాన్సర్ వంటి అత్యంత ప్రమాదకర రోగాలు వస్తున్నాయి. అందుకోసం ప్రతీ ఒక్కరూ ప్రమాదకర రంగులకు బదులు సంప్రదాయిక రంగులంను వాడి హోళీని మరింత ఆరోగ్యకరంగా జరుపుకునే ప్రయత్నం చేయాలి...
రంగు రంగుల హోళీ మన జీవితాలలో కూడా రంగులు నింపాలని కోరుతూ అందరికీ హోళీ పండుగ శుభాకాంక్షలు.....
No comments:
Post a Comment