8-460- వ.
అంత
8-461- సీ.
తన తనూజుప్రోలు ద నుజులు గొనుటయు;
వేల్పు లెల్లను డాఁగ వెడలుటయును
భా వించి సురమాత ప రితాపమునఁ బొంది;
వగ ననాథాకృతి వ నరుచుండ
నా యమ్మ పెనిమిటి య గు కశ్యపబ్రహ్మ;
మఱి యొకనాఁడు సమా ధి మాని
తన కుటుంబిని యున్న ధా మమునకు నేగి;
నాతిచే విహితార్చ న ములు పడసి
8-461.1- ఆ.
వం ది వ్రాలి కుంది వా డిన యిల్లాలి
వదనవారిజంబు వ డువుఁ జూచి
చే రఁ దిగిచి మగువ చి బుకంబు పుడుకుచు
"వా రిజాక్షి! యేల వ గచె" దనుచు.
టీకా:
అంత = అంతట. తన = తన యొక్క; తనుజుల = పుత్రుల; ప్రోలు = పట్టణము (అమరావతి); దనుజులు = రాక్షసులు; కొనుటయున్ = ఆక్రమించుట; వేల్పులు = దేవతలు; ఎల్లను = అందరును; డాగన్ = దాగుకొనుటకు; వెడలుటయును = వెళ్ళుట; భావించి = తలచుకొని; సురమాత = అదితి {సురమాత - సుర (దేవత) మాత, అదితి}; పరితాపమును = దుఃఖమును; పొంది = పొంది; వగవన్ = వగచుచుండగ; అనాథ = దిక్కులేనామె; ఆకృతిన్ = వలె; వనరుచుండన్ = దీనాలాపములాడు చుండ; ఆ = ఆ; అమ్మ = తల్లి; పెనిమిటి = భర్త; అగు = అయిన; కశ్యప = కశ్యపుడు యనెడి; బ్రహ్మ = ప్రజాపతి; మఱి = తరువాత; ఒక = ఒక; నాడు = రోజు; సమాధి = తపోసమాధి; మాని = వదలివేసి;
తన = తన యొక్క; కుటుంబిని = భార్య; ఉన్న = ఉన్నట్టి; ధామమున్ = ఇంటి; కున్ = కి; ఏగి = వెళ్ళి; నాతి = భార్య; చేన్ = చేత; విహిత = తగినవిధముగ; అర్చనములు = పూజలు; పడసి = పొంది. వంది = మెచ్చుకొని; వ్రాలి = వాలిపోయి; కుంది = కుంగిపోయి; వాడిన = వాడిపోయి యున్నట్టి; ఇల్లాలి = భార్య యొక్క {ఇల్లాలు - ఇంటియందలిస్త్రీ, భార్య}; వదన = మోముయనెడి; వారిజంబు = పద్మము; వడువున్ = విధమును, రీతిని; చూచి = చూసి; చేరన్ = దగ్గరకు; తిగిచి = పిలిచి; మగువ = ఇంతి; చిబుకంబు = గడ్డము;
పుడుకుచున్ = పుణుకుచు; వారిజాక్షి = సుందరి {వారిజాక్షి - వారిజము (పద్మము) వంటి అక్షి (కన్నులున్నామె), స్త్రీ}; ఏల = ఎందులకు; వగచెదు = దుఃఖించెదవు; అనుచున్ = అనుచు.
భావము:
దేవతలు తరలిపోవడం , బలి అమరావతిని ఆక్రమించుకోవడం జరిగిన పిమ్మట. . . దేవతల తల్లి యైన అదితి అమరావతిని రాక్షసులు ఆక్రమించుకోవడం , దానితో తలదాచుకోవడానికి తనకు పుట్టిన దేవతలు తరలిపోవడం తలచుకుంటూ దిక్కులేనిదాని వలె దుఃఖించింది. ఒకనాడు ఆమెభర్త కశ్యపప్రజాపతి తపస్సు చాలించి ఇంటికి వచ్చాడు. అదితిచేత పూజలు అందుకున్నాడు. బాధతో కుంది కుంగిన ఆమె ముఖ పద్మాన్ని చూచి ఆమెను చేరదీసి ఓదార్చాడు. “ఓ కమలాక్షీ ఎందుకు బాధపడుతున్నావు” అని అంటూ ఇంకా . . .
http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=65&Padyam=461
: :చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం: :
No comments:
Post a Comment