Saturday, 1 April 2017

మత్స్యావతార కథ - 19:


8-724-మ.
తమలోఁ బుట్టు నవిద్య గప్పికొనుడుం దన్మూలసంసార వి
భ్రములై కొందఱు దేలుచుం గలఁగుచున్ బల్వెంటలన్ దైవ యో
గమునం దే పరమేశుఁ గొల్చి ఘనులై కైవల్య సంప్రాప్తులై
ప్రమదంబందుదు రట్టి నీవు కరుణం బాలింపు మమ్మీశ్వరా!
8-725-ఉ.
కన్నులు గల్గువాఁడు మఱి కాననివారికిఁ ద్రోవఁ జూపఁగాఁ
జన్న తెఱంగు మూఢునకు సన్మతిఁ దా గురుఁడౌట సూర్యుఁడే
కన్నులుగాఁగ భూతములఁ గాంచుచు నుండు రమేశ! మాకు ను
ద్యన్నయమూర్తివై గురువవై యల సద్గతిజాడఁ జూపవే.

భావము:
“ఓ భగవంతుడా! తమలో పుట్టిన అజ్ఞానం ఆవరించడం వలన కొందరు ఆ అజ్ఞాన మూలమైన సంసారంలో పడి చిక్కుకుని మోసపోయి కలతపడతారు. అటువంటివారు అదృష్టం వలన పరమాత్ముడవు అయిన నిన్ను సేవించి మోక్షాన్ని పొంది సంతోషపడతారు. ఆవిధంగా అందరిని ఆదరించే నీవు మమ్ములను కాపాడు. లక్ష్మీపతీ! హరీ! సూర్యుడే కన్నులుగా నీవు ప్రాణులను చూస్తూ ఉంటావు. జ్ఞానం లేనివానికి దుర్భుద్ధి కలవానికి నీవే తండ్రివి. కాబట్టి కన్నులు ఉన్నవాడు కన్నులు లేనివాడికి దారి చూపిన విధంగా మమ్ములను ఉద్ధరించు. గురుడవై మాకు దారి చూపించు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=90&padyam=725

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

కపిల దేవహూతి సంవాదం - 21

3-895-సీ. అట్టి యహంకార మం దధిష్టించి సా;  హస్రఫణామండలాభిరాముఁ డై తనరారు ననంతుఁడు సంకర్ష;  ణుం డనఁ దగు పురుషుండు ఘనుఁడు మహిత భూతేంద్రియ...