Friday, 19 May 2017

దక్ష యాగము - 37:

4-96-వ.
అని యిట్లు యజ్ఞసభా మధ్యంబునం బ్రతికూలుండగు దక్షు నుద్దేశించి పలికి కామక్రోధాది శత్రువిఘాతిని యగు సతీదేవి యుదఙ్ముఖి యయి జలంబుల నాచమనంబు చేసి శుచియై మౌనంబు ధరియించి జితాసనయై భూమియం దాసీన యగుచు యోగమార్గంబునం జేసి శరీరత్యాగంబు చేయం దలంచి.
4-97-సీ.
వరుసఁ బ్రాణాపాన వాయునిరోధంబు;
గావించి వాని నేకముగ నాభి
తలమునఁ గూర్చి యంతట నుదానము దాఁక;
నెగయించి బుద్ధితో హృదయపద్మ
మున నిల్పి వాని మెల్లన కంఠమార్గము;
నను మఱి భూమధ్యమున వసింపఁ
జేసి శివాంఘ్రి రాజీవ చింతనముచే;
నాథునిఁ దక్క నన్యంబుఁ జూడ
4-97.1-తే.
కమ్మహాత్ముని యంక పీఠమ్మునందు
నాదరంబున నుండు దేహంబు దక్షు
వలని దోషంబునను విడువంగఁ దలఁచి
తాల్చెఁ దనువున ననిలాగ్ని ధారణములు.

టీకా:
అని = అని; ఇట్ల = ఈవిధముగ; యజ్ఞ = యజ్ఞ; సభా = సదస్సు యొక్క; మధ్యంబున = మధ్యభాగములో; ప్రతికూలుండు = వ్యతిరేకి; అగు = అయిన; దక్షున్ = దక్షుని; ఉద్దేశించి = ఉద్దేశించి; పలికి = పలికి; కామ = కామము {కామక్రోధాదిశత్రువులు - అరిషడ్వర్గములు, 1కామ 2క్రోధ 3లోభ 4మోహ 5మద 6మాత్సర్యములు}; క్రోధ = క్రోధము; ఆది = మొదలైన; శత్రు = శత్రువులను; విఘాతిని = నశింపజేయునది; అగు = అయిన; సతీదేవి = సతీదేవి; యదత్ = తూర్పునకు; ముఖి = తిరిగినది; అయి = అయ్యి; జలంబులన్ = నీటిని; ఆచమనంబు = ఆచమనము; చేసి = చేసి; శుచి = శుచి; ఐ = అయ్యి; మౌనంబున్ = మౌనమును; ధరియించి = స్వీకరించి; జిత = జయించిన; ఆసన = ఆసనముకలది; ఐ = అయ్యి; భూమి = నేల; అందు = పైన; ఆసీన = కూర్చున్నది; అగుచు = అవుతూ; యోగ = యోగమునకు చెందిన; మార్గంబునన్ = విధానము; చేసి = అందు; శరీర = దేహమును; త్యాగంబున్ = విడుచుట; చేయన్ = చేయవలెనని; తలంచి = అనుకొని. వరుసన్ = వరుసగా; ప్రాణ = ప్రాణవాయువు; అపాన = అపాన; వాయు = వాయువులను; నిరోధము = ఆపుట; కావించి = చేసి; వానిన్ = వాటిని; ఏకముగ = ఒకటిగకలిపి; నాభి = బొడ్డు; తలమునన్ = ప్రాంతమున; కూర్చి = చేర్చి; అంతటన్ = అప్పుడు; ఉదానము = ఉదానస్థానము; దాకన్ = వరకు; ఎగయించి = ఎక్కించి; బుద్ధితో = బుద్ధిపూర్వకముగ; హృదయ = హృదయము అనెడి; పద్మమున = పద్మమున; నిల్పి = నిలబెట్టి; వానిని = వాటిని; మెల్లన = మెల్లగ; కంఠ = కంఠము; మార్గమున = దారియమ్మటను; మఱి = మరి; భూమధ్యమునన్ = భృమధ్యమునను; వసింపన్ = ఉండునట్లు; చేసి = చేసి; శివ = శివుని యొక్క; అంఘ్రి = పాదములు అనెడి; రాజీవ = పద్మముల; చింతనము = ధ్యానము; చేత = వలన; నాథునిన్ = భర్తను; తక్క = తప్పించి; అన్యంబున్ = ఇతరమును; చూడక = చూడకుండగ; ఆ = ఆ; మహాత్ముని = గొప్పవాని. అంక = ఒడి అనెడి; పీఠమ్ము = ఆసనము; అందున్ = పైన; ఆదరంబునన్ = ప్రీతిగ; ఉండు = ఉండెడి; దేహంబున్ = శరీరమును; దక్షున్ = దక్షని; వలని = మూలమున; దోషంబునను = ధోషముచేత; విడువంగ = విడిచిపెట్ట; తలచి = నిర్ణయించుకొని; తాల్చెన్ = ధరించెను; తనువునన్ = దేహమందు; అనిల = వాయువును; అగ్నిన్ = అగ్నుల; ధారణములు = ధారణములు.

భావము:
అని ఈ విధంగా యజ్ఞమండప మధ్యభాగంలో తమకు వ్యతిరేకి అయిన దక్షునితో పలికి, కామక్రోధాదులైన అంతశ్శత్రువులను నాశనం చేసే సతీదేవి తూర్పుదిక్కుకు తిరిగి, జలాలతో ఆచమనం చేసి, శుచియై, మౌనం పూని, నేలపై కూర్చొని యోగమార్గం ద్వారా శరీరాన్ని విడిచిపెట్టాలని నిశ్చయించుకొన్నదై... ప్రాణాపానాలనబడే వాయువులను నిరోధించి, వాటి నొక్కటిగా చేసి బొడ్డుతో కలిపి, ఉదానస్థానం వరకు ఎక్కించి, బుద్ధిపూర్వకంగా హృదయపద్మంలో నిలిపి, మెల్లగా కంఠమార్గంలో భ్రూమధ్య భాగానికి చేర్చి, మనస్సులో శివుని పాదపద్యాలను ధ్యానిస్తూ అతన్ని తప్ప ఇతరములైనవేవీ చూడక అతని ఒడిలో ఆదరంతో ఉండే దేహాన్ని దక్షుని కారణంగా విడిచిపెట్టాలని నిర్ణయించుకొని, యోగాగ్నిని రగుల్కొల్పింది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=6&Padyam=97

: : చదువుకుందాం భాగవతం; బాగుపడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

కపిల దేవహూతి సంవాదం - 21

3-895-సీ. అట్టి యహంకార మం దధిష్టించి సా;  హస్రఫణామండలాభిరాముఁ డై తనరారు ననంతుఁడు సంకర్ష;  ణుం డనఁ దగు పురుషుండు ఘనుఁడు మహిత భూతేంద్రియ...