Monday, 26 November 2018

శ్రీకృష్ణ లీలావిలాసం - 58

10.1-544-సీ.
తన కన్యములు లేక తనరారి ముమ్మూల; 
విభుడయ్యుఁ గ్రేపుల వెదకువాని
నఖిలజ్ఞుఁడై యొక్కఁడయ్యు నజ్ఞాకృతిఁ; 
జెలికాండ్రఁ బెక్కండ్రఁ జీరువాని
బహిరంతరాద్యంత భావశూన్యుండయ్యు; 
నంతంత నడుగు చొప్పరయువాని
గురుగభీరుండయ్యుఁ గురువులు వాఱుచు; 
నట్టిట్టు పాతరలాడువాని
10.1-544.1-ఆ.
జాతిరహితుఁ డయ్యుఁ జతుర గోపార్భక
భావ మెల్ల నచ్చుపడిన మేటి
చెలువువాని హస్త శీతాన్నకబళంబు
వానిఁ గాంచె నపుడు వాణిమగఁడు.


భావము:
పిమ్మట, సృష్టికి మూలము లైన త్రిగుణాలకూ ఆధారమూ, ప్రభువూ అయినవాడు; తనకు తాను ఒక్కడే అయినా, లేగల కోసం చూస్తూ వెతుకుతున్నాడు కృష్ణుడు. నర్వం తెలిసినవాడు తాను ఒక్కడే అయి సత్యం తానే అయినవా డైనా, ఎందరో స్నేహితులు ఉన్నట్లు పిలుస్తూ ఉన్నాడు. బయట లోపల మొదలు తుద అనే భావాలేవీ లేనివా డైనా, అక్కడక్కడా దూడల జాడలు వెదుకుతూ ఉన్నాడు, ఎంతో లోతైనవాడైనా, పరుగులు తీస్తూ ఇటూ అటూ చూస్తూ అడుగులు వేస్తున్నాడు, అతనికి జాతి అనేది లేదు అయినా, నేర్పరి అయిన గోపబాలుని లక్షణాలన్నీ చక్కగా అచ్చుపోసినట్లు ఉన్న శరిరంతో అందంగా వెలుగొందుతూ ఉన్నాడు. చేతిలో చల్ది అన్నపు ముద్ద పట్టుకుని ఉన్నాడు. ఇలా సర్వ లక్షణాలు మేళవించిన కృష్ణుని కేవలం వాక్కుకు మాత్రమే అధిపతియైన బ్రహ్మదేవుడు చూసాడు.



// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :




No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...