Friday 19 July 2019

కపిల దేవహూతి సంవాదం - 68


(భక్తి యోగం)

3-963-తే.
గురుతరానేక కళ్యాణగుణవిశిష్ఠుఁ
డనఁగ నొప్పిన ననుఁ బొందు నండగొనక
పవనవశమునఁ బువ్వుల పరిమళంబు 
ఘ్రాణమున నావరించినకరణి మెఱసి.
3-964-చ.
అనిశము సర్వభూతహృదయాంబుజవర్తి యనం దనర్చు నీ
శు నను నవజ్ఞసేసి మనుజుం డొగి మత్ప్రతిమార్చనా విడం
బనమున మూఢుఁడై యుచితభక్తిని నన్ను భజింపఁడేని న
మ్మనుజుఁడు భస్మకుండమున మానక వేల్చిన యట్టివాఁ డగున్.

భావము:
అలాంటి పుణ్యాత్ముడు అనంత కళ్యాణగుణ సంపన్నుడనైన నన్ను పొందుతాడు. గాలి ద్వారా పువ్వుల సుగంధం ఘ్రాణేంద్రియాన్ని ఆశ్రయించిన విధంగా ఇతరమైన ఎటువంటి అండదండలు లేకుండానే అనాయాసంగా నన్ను చేరుకుంటాడు. ఎల్లప్పుడు అఖిల జీవుల హృదయ కమలాలలో అంతర్యామినై ఉండే నన్ను అలక్ష్యం చేసి కేవలం నా విగ్రహాలను మాత్రమే ఆడంబరంగా పూజిస్తూ లోకాన్ని మోసగించేవాడు మూర్ఖుడు. అచంచలమైన భక్తితో నన్ను ఆరాధింపని వాని పూజలు బూడిదలో పోసిన హోమద్రవ్యాలవలె నిరర్థకాలు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=964

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...