Saturday 20 July 2019

కపిల దేవహూతి సంవాదం - 69


(భక్తి యోగం)

3-965-సీ.
అబ్జాక్షి నిఖిలభూతాంతరాత్ముఁడ నైన; 
నా యందు భూతగణంబు నందు
నతిభేదదృష్టి మాయావులై సతతంబుఁ; 
బాయక వైరానుబంధ నిరతు
లగువారి మనములఁ దగులదు శాంతి యె; 
న్నఁటికైన నేను నా కుటిలజనుల
మానక యెపుడు సామాన్యాధికద్రవ్య; 
సమితిచే మత్పదార్చన మొనర్ప
3-965.1-తే.
నర్థి నాచిత్తమున ముదం బందకుందు"
ననుచు నెఱిఁగించి మఱియు నిట్లనియెఁ గరుణఁ
గలిత సద్గుణ జటిలుఁ డక్కపిలుఁ డెలమిఁ
దల్లితోడ గుణవతీమతల్లితోడ.

భావము:
కమలాలవంటి కన్నులు గల తల్లీ! నేను సమస్త జీవులలో అంతర్యామినై ఉన్నాను. అటువంటి నాయందు, మిగిలిన జీవరాసుల యందు భేదదృష్టి కలిగి మాయావులై విరోధభావంతో మెలిగేవారికి మనశ్శాంతి దొరకదు. అటువంటి కుటిలాత్ములు ఎంతో ద్రవ్యం వెచ్చించి అట్టహాసంగా, ఆడంబరంగా నాకు పాదపూజలు చేసినా నేను తృప్తిపడను. సంతోషించను” అని చెప్పి సతీమతల్లియైన తల్లితో ఉత్తమగుణధుర్యుడైన కపిలుడు ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=52&padyam=965

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...