Tuesday 7 April 2020

ధృవోపాఖ్యానము - 26


4-289-క.
"ధీరవ్రత! రాజన్య కు
మారక! నీ హృదయమందు మసలిన కార్యం
బారూఢిగా నెఱుంగుదు
నారయ నది వొందరాని దైనను నిత్తున్.
4-290-వ.
అది యెట్టి దనిన నెందేని మేధియందుఁ బరిభ్రామ్యమాణ గోచక్రంబునుం బోలె గ్రహనక్ష త్రతారాగణ జ్యోతిశ్చక్రంబు నక్షత్ర రూపంబు లయిన ధర్మాగ్ని కశ్యప శక్రులును సప్తర్షులును, దారకా సమేతులై ప్రదక్షిణంబు దిరుగుచుండుదురు; అట్టి దురాపంబును ననన్యాధిష్ఠితంబును లోకత్రయ ప్రళయకాలంబునందు నశ్వరంబుగాక ప్రకాశమానంబును నయిన ధ్రువక్షితి యను పదంబు ముందట నిరువది యాఱువేలేండ్లు చనం బ్రాపింతువు; తత్పద ప్రాప్తిపర్యంతంబు భవదీయ జనకుండు వనవాస గతుండైనం దద్రాజ్యంబు పూజ్యంబుగా ధర్మమార్గంబున జితేంద్రియుండవై చేయుదువు; భవదనుజుం డగు నుత్తముండు మృగయార్థంబు వనంబునకుం జని మృతుం డగు; తదన్వేషణార్థంబు తదాహిత చిత్త యై తన్మాతయు వనంబునకుం జని యందు దావదహన నిమగ్న యగు; వెండియు.

భావము:
“అచంచల దీక్షావ్రతా! రాకుమారా! నీ మనస్సులోని అభిప్రాయాలను చక్కగా గ్రహించాను. అయితే అది దుర్లభమైనది. అయినప్పటికీ నీ కోరిక తీరుస్తాను. కట్టుకొయ్య చుట్టూ పశువుల మంద తిరిగినట్లుగా గ్రహాలు, నక్షత్రాలు, తారాగణాలు, జ్యోతిశ్చక్రం, నక్షత్ర స్వరూపాలైన ధర్ముడు, అగ్ని, కశ్యపుడు, శుక్రుడు, సప్తర్షులు, తారకలతో కూడి దేనికి ప్రదక్షిణం చేస్తారో అటువంటి ధ్రువక్షితి అనే మహోన్నత స్థానాన్ని ఇకపైన ఇరవైఆరువేల సంవత్సరాల తరువాత నీవు పొందుతావు. అది ఎవ్వరికీ అందరానిది. ఇదివరకు ఎవ్వరూ దానిని పొందలేదు. ముల్లోకాలు నశించేటప్పుడు కూడా అది నశించకుండా ప్రకాశిస్తూ ఉంటుంది. అటువంటి స్థానాన్ని నీవు అలంకరిస్తావు. అంతవరకు నీ తండ్రి రాజ్యాన్ని నీవు సర్వజన రంజకంగా ధర్మమార్గాన పరిపాలిస్తావు. ఇంద్రియాలను జయిస్తావు. నీ తండ్రి అడవికి పోయి వానప్రస్థాశ్రమం స్వీకరిస్తాడు. నీ తమ్ముడైన ఉత్తముడు వేటకై అడవికి వెళ్ళి మరణిస్తాడు. అతనిని వెదుకుతూ అతనియందే మనస్సు చేర్చిన అతని తల్లి అరణ్యంలో ప్రవేశిస్తుంది. ఆమె అడవిలో కార్చిచ్చులో పడి కాలిపోతుంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=290

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...