Thursday 9 April 2020

ధృవోపాఖ్యానము - 27

4-291-సీ.
అనఘాత్మ! మఱి నీవు యజ్ఞరూపుం డనఁ;
దగు నన్ను సంపూర్ణ దక్షిణంబు
లగు మఖంబులచేత నర్చించి సత్యంబు;
లగు నిహసౌఖ్యంబు లనుభవించి
యంత్యకాలమున నన్నాత్మఁ దలంచుచు;
మఱి సర్వలోక నమస్కృతమును
మహిఁ బునరావృత్తి రహితంబు సప్తర్షి;
మండలోన్నత మగు మామకీన
4-291.1-తే.
పదము దగఁ బొందఁగల" వని పరమపురుషుఁ
డతని యభిలషితార్థంబు లర్థి నిచ్చి
యతఁడు గనుఁగొను చుండంగ నాత్మపురికి
గరుడగమనుఁడు వేంచేసెఁ గౌతుకమున.
4-292-తే.
అంత ధ్రువుఁడునుఁ బంకేరుహాక్ష పాద
కమల సేవోపపాదిత ఘన మనోర
థములఁ దనరియుఁ దనదు చిత్తంబులోనఁ
దుష్టిఁ బొందక చనియె విశిష్టచరిత!"
4-293-క.
అని మైత్రేయుఁడు ధ్రువుఁ డ
ట్లనయము హరిచేఁ గృతార్థుఁడైన విధం బె
ల్లను వినిపించిన విదురుఁడు
విని మునివరుఁ జూచి పలికె వినయం బెసఁగన్.

భావము:
పుణ్యాత్మా! నీవు యజ్ఞపురుషుడనైన నన్ను సంపూర్ణ దక్షిణలతో కూడిన యజ్ఞాలచేత ఆరాధిస్తావు. ఈ లోకంలోని అనంత సౌఖ్యాలను అనుభవిస్తావు. మరణకాలంలో నన్ను మనస్సులో స్మరిస్తూ, సకల లోకాలకు వందనీయమై, పునరావృత్తి రహితమై సప్తర్షిమండలం పైన ఉండే నా స్థానాన్ని పొందుతావు.” అని భగవంతుడు ధ్రువుడు కోరిన కోరికలను ప్రసాదించి, అతడు చూస్తూ ఉండగానే గరుత్మంతుణ్ణి అధిరోహించి ఆనందంగా తన పట్టణమైన వైకుంఠమునకు వేంచేశాడు. అప్పుడు ధ్రువుడు పద్మాక్షుడైన విష్ణువు యొక్క పాదపద్మాలను సేవించడం వల్ల సమధిక మనోరథాలు సంప్రాప్తించినప్పటికీ, సంతృప్తి పొందక చింతిస్తూ వెళ్ళిపోయాడు అని ఈ విధంగా మైత్రేయుడు ధ్రువుడు శ్రీహరినుండి వరాలను పొందిన విధం అంతా విదురునికి వినిపించాడు. విన్న విదురుడు మహర్షితో సవినయంగా ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=292

: : భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...