Thursday 9 April 2020

ధృవోపాఖ్యానము - 28


4-294-క.
"మునినాయక! విను కాముక
జనదుష్ప్రాపంబు విష్ణు చరణాంబురుహా
ర్చన మునిజన సంప్రాప్యము
ననఁగల పంకేరుహాక్షు నవ్యయ పదమున్.
4-295-వ.
పెక్కు జన్మంబులం గాని పొందరాని పదంబు దా నొక్క జన్మంబుననే పొందియుం దన మనంబునం దప్రాప్త మనోరథుండ నని పురుషార్థవేది యైన ధ్రువుం డెట్లు దలంచె” ననిన మైత్రేయుం డిట్లనియె
4-296-తే.
"అనఘ! పినతల్లి దన్నుఁ బల్కిన దురుక్తి
బాణవిద్ధాత్ముఁ డగుచుఁ దద్భాషణములు
చిత్తమందుఁ దలంచుటఁ జేసి ముక్తిఁ
గోరమికి నాత్మలో వగఁ గూరుచుండె.
4-297-వ.
అంత నా ధ్రువుండు.

భావము:
“మునీంద్రా! కాముకులకు పొందరానిది, విష్ణు భక్తులైన మునులు మాత్రమే పొందగలిగినది శాశ్వతమైన విష్ణుపదం కదా! ఎన్నో జన్మలకు కాని పొందరాని విష్ణుపదాన్ని తాను ఒక్క జన్మలోనే పొందికూడా పురుషార్థాలను చక్కగా ఎరిగిన ధ్రువుడు తన కోరిక తీరలేదని ఎందుకు భావించాడు?” అని ప్రశ్నించగా మైత్రేయుడు ఇలా అన్నాడు. “పుణ్యాత్మా! పినతల్లి ఆడిన దుర్భాషలు అనే బాణాలచేత ధ్రువుని మనస్సు బాగా గాయపడింది. అందుచేత ఆ దుర్భాషలనే మాటిమాటికి స్మరిస్తూ హరి ప్రత్యక్షమైనపుడు ముక్తిని కోరలేకపోయాడు. అందుకే అతడు మనస్సులో పరితపిస్తున్నాడు. అప్పుడు ఆ ధ్రువుడు...

http://telugubhagavatam.org/?tebha&Skanda=4&Ghatta=11&padyam=296

: :  భాగవతం చదువుకుందాం : : 
: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...