Monday 1 June 2020

ఉషా పరిణయం - 13

( చిత్రరేఖ పటంబున చూపుట )

10.2-347-సీ.
"కమనీయ సంగీత కలిత కోవిదులు కిం;
పురుష గంధర్వ కిన్నరులు వీరె
సతత యౌవన యదృచ్ఛావిహారులు సిద్ధ;
సాధ్య చారణ నభశ్చరులు వీరె
ప్రవిమల సౌఖ్య సంపద్వైభవులు సుధా;
శన మరు ద్యక్ష రాక్షసులు వీరె
నిరుపమ రుచి కళాన్విత కామరూపులై;
పొగడొందునట్టి పన్నగులు వీరె
10.2-347.1-తే.
చూడు" మని నేర్పుఁ దీపింపఁ జూపుటయునుఁ
జిత్తము నిజమనోరథసిద్ధి వడయఁ
జాలకుండిన మధ్యమ క్ష్మాతలాధి
పతులఁ జూపుచు వచ్చె న ప్పద్మనయన.
10.2-348-ఉ.
"మాళవ కొంకణ ద్రవిడ మత్స్య పుళింద కళింగ భోజ నే
పాళ విదేహ పాండ్య కురు బర్బర సింధు యుగంధ రాంధ్ర బం
గాళ కరూశ టేంకణ త్రిగర్త సుధేష్ణ మరాట లాట పాం
చాల నిషాద ఘూర్జరక సాళ్వ మహీశులు వీరె కోమలీ!

భావము:
“వీరు కమనీయ సంగీత విద్య యందు విశారదులైన గంధర్వ, కిన్నర. కింపురుషులు; వీరు నిత్యయౌవనులూ, స్వేచ్ఛావిహారులూ అయిన సిద్ధ, సాధ్య, చారణులు; ఇదిగో వీరు అమితమైన సౌఖ్యాలలో తేలియాడే అమరులు, మరుత్తులు, యక్షులు, రాక్షసులు; వీరు కామరూపులై గణుతిగాంచిన కళానిధులు నాగకుమారులు; వీరిని చూడు” అని చిత్రరేఖ చూపగా, ఉషాకన్యకు వారిలో ఆమె ప్రియుడు కనిపించ లేదు. అప్పుడు చిత్రరేఖ భూలోకవాసు లైన రాకుమారులను చూపించడం మొదలు పెట్టింది. “ఓ కోమలీ! వీరిని చూడు మాళవ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాల, విదేహ, పాండ్య, కురు, బర్బర, సింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, కరూశ, టేంకణ, త్రిగర్త, సుధేష్ణ, మరాట, లాట, పాంచాల, నిషాద, ఘూర్జర, సాళ్వ దేశాధీశ్వరులు వీరు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=33&padyam=347

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...