Monday 1 June 2020

ఉషా పరిణయం - 14


( చిత్రరేఖ పటంబున చూపుట )

10.2-349-ఉ.
సింధురవైరివిక్రముఁడు, శీతమయూఖ మరాళికా పయ
స్సింధుపటీర నిర్మలవిశేష యశోవిభవుండు, శౌర్య ద
ర్పాంధ రిపుక్షితీశ నికరాంధతమః పటలార్కుఁ డీ జరా
సంధునిఁ జూడు మాగధుని సద్బృహదశ్వసుతుం గృశోదరీ!
10.2-350-మ.
సకలోర్వీతలనాథ సన్నుతుఁడు, శశ్వద్భూరి బాహాబలా
ధికుఁ, డుగ్రాహవకోవిదుండు, త్రిజగద్విఖ్యాతచారిత్రకుం,
డకలంకోజ్జ్వల దివ్యభూషుఁడు విదర్భాధీశ్వరుండైన భీ
ష్మక భూపాలకుమారుఁ జూడు మితనిన్ మత్తద్విరేఫాలకా!
10.2-351-ఉ.
సంగరరంగ నిర్దళిత చండవిరోధి వరూధినీశ మా
తంగ తురంగ సద్భట రథప్రకరైక భుజావిజృంభణా
భంగ పరాక్రమప్రకట భవ్యయశోమహనీయమూర్తి కా
ళింగుఁడు వీఁడె చూడు తరళీకృత చారుకురంగలోచనా!

భావము:
ఓ తలోదరీ! ఇడుగో ఇతడు బృహదశ్వుని పుత్రుడు మగధరాజైన జరాసంధుడు; ఈ జరాసంధుడు సింహపరాక్రముడు; నిర్మల కీర్తిమంతుడు; శత్రు భయంకరుడు. ఓ అలికులనీలవేణీ! ఇతడు భీష్మకమహారాజు కుమారుడు రుక్మి; ఈ విదర్భరాజు సమస్త రాజలోక సన్నుతుడు; భుజబలసంపన్నుడు; రణకోవిదుడు; ప్రఖ్యాతచరిత్రుడు; దివ్యాలంకారభూషితుడు; లేడికన్నుల ఉషా సుందరీ! ఇడుగో చూడుము. ఇతడు కళింగ భూపాలుడు యుద్ధరంగంలో శత్రువులను చీల్చిచెండాడేవాడు; వైరిసేనాపతులను చతురంగబలాలను తన అవక్రపరాక్రమంతో పరాజితులను గావించి అఖండ మైన కీర్తిగాంచిన వీరాధివీరుడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=33&padyam=351

: :  భాగవతం చదువుకుందాం : :

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...