Saturday 27 June 2020

ఉషా పరిణయం - 29

( అనిరుద్ధుని నాగపాశ బద్ధంబు )

10.2-384-వ.
ఇవ్విధంబున సైన్యంబు దైన్యంబునొంది వెఱచియుం, బఱచియు, విచ్చియుం, జచ్చియుఁ, గలంగియు, నలంగియు, విఱిగియు, సురిఁగియుఁ, జెదరియు బెదరియుఁ, జేవదఱిఁగి నుఱుములై తన మఱుఁగు సొచ్చిన, బాణుండు శౌర్యధురీణుండును, గోపోద్దీపిత మానసుండునై కదిసి యేసియు, వ్రేసియుఁ, బొడిచియు, నడిచియుఁ, బెనంగి
10.2-385-క.
క్రుద్ధుండై యహిపాశ ని
బద్ధుం గావించె నసురపాలుఁడు రణ స
న్నద్ధున్, శరవిద్ధు, న్నని
రుద్ధున్, మహితప్రబుద్ధు, రూపసమృద్ధున్.
10.2-386-వ.
ఇట్లు కట్టిత్రోచిన నుషాసతి శోకవ్యాకులితచిత్తయై యుండె నంత.

భావము:
ఈ విధంగా దానవసైన్యం చేవచచ్చి, నొచ్చి, విచ్చి, భయంతో, చెదరి బెదరి, పారిపోయి వచ్చి బాణాసురుని అండకై వెనుక చేరింది. పరమ పరాక్రమశాలి అయిన బాణాసురుడు శౌర్యక్రోధాలతో అనిరుద్ధుని ఎదిరించి భీకర యుద్ధం చేసాడు. ఈ విధంగా బాణాసురుడు కోపంతో విజృంభించి, వంటినిండా నాటిన బాణాలతో ఉన్న రూపసమృద్ధుడూ, రణసన్నద్ధుడూ, బుద్ధిమంతుడు అయిన అనిరుద్ధుడిని నాగపాశంతో బంధించాడు.
తన ప్రియుడైన అనిరుద్ధుడిని తన తండ్రి ఈవిధంగా బంధించటం చూసిన ఉషాకాంత శోకసంతప్త హృదయరాలైంది. ఇంతలో...

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=35&padyam=384

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...