Sunday 28 June 2020

ఉషా పరిణయం - 30


( అనిరుద్ధుని నాగపాశ బద్ధంబు )

10.2-387-క.
నీలపటాంచితమై సువి
శాలంబై వాయునిహతిఁ జండధ్వని నా
భీలమగు నతని కేతన
మాలోన నకారణంబ యవనిం గూలెన్.
10.2-388-క.
అది చూచి దనుజపాలుఁడు
మదనాంతకుఁ డాడినట్టి మాట నిజముగాఁ
గదనంబు గలుగు ననుచును
నెదురెదురే చూచుచుండె నెంతయుఁ బ్రీతిన్.
10.2-389-వ.
అంత నక్కడ.
10.2-390-క.
ద్వారకలో ననిరుద్ధకు
మారుని పోకకును యదుసమాజము వగలం
గూరుచు నొకవార్తయు విన
నేరక చింతింప నాల్గునెల లరిగె నృపా!

భావము:
ఆ సమయంలో, ఏ కారణం లేకుండానే బలంగా వీచిన గాలిదెబ్బకే నీలవస్త్రంతో సువిశాల మైన బాణాసురుని జెండా భయంకర ధ్వని చేస్తూ నేలకూలింది. అలా పడిన తన జెండాకొయ్యను చూసిన ఆ దానవరాజు సంతోషపడి, “ఆ మన్మథహారి మహేశ్వరుడు పలికిన మాటలు నిజమయ్యే సమయం వచ్చింది; ఇక తనకు తగిన వాడితో పోరు దొరుకుతుం” దని భావించి ఎంతో ఆశక్తితో ఎదురుచూడసాగాడు. ఆ సమయంలో అక్కడ ద్వారకలో అనిరుద్ధుడు మాయమైనందుకు యాదవులు అంతా విచారించారు. వారికి నాలుగు నెలల గడచినా అనిరుద్ధుడిని గురించి ఏ వార్తే తెలియ లేదు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=35&padyam=390

: :  భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...