( ముచికుందుడు స్తుతించుట )
10.1-1666-వ.
నరేంద్రా! నీవు తొల్లి క్షత్రధర్మంబున నిలిచి, మృగయావినోదంబుల జంతువుల వధియించినాఁడవు; తపంబునఁ దత్కర్మ విముక్తుండవై తర్వాతి జన్మంబున సర్వభూత సఖిత్వంబు గలిగి, బ్రాహ్మణ శ్రేష్ఠుండవై నన్నుఁ జేరెద” వని వీడ్కొలిపిన హరికిఁ బ్రదక్షింబు వచ్చి నమస్కరించి గుహ వెడలి సూక్ష్మప్రమాణ దేహంబులతో నున్న మనుష్య పశు వృక్షలతాదులం గని కలియుగంబు ప్రాప్తం బగు నని తలంచి యుత్తరాభిముఖుండై తపోనిష్ఠుం డగుచు సంశయంబులు విడిచి, సంగంబులు పరిహరించి విష్ణుని యందుఁ జిత్తంబు చేర్చి గంధమాదనంబు ప్రవేశించి మఱియు నరనారాయణ నివాసంబైన బదరికాశ్రమంబు చేరి, శాంతుండై హరి నారాధించుచుండె, నిట్లు ముచికుందుని వీడ్కొని.
10.1-1667-శా.
అచ్ఛిద్రప్రకట ప్రతాపరవిచే నాశాంతరాళంబులంన్
బ్రచ్ఛాదించుచుఁ గ్రమ్మఱన్ మథురకుం బద్మాక్షుఁ డేతెంచి వీ
డాచ్ఛాదించి మహానిరోధముగఁ జక్రాకారమై యున్న యా
మ్లేచ్ఛవ్రాతము నెల్లఁ ద్రుంచె రణభూమిం బెంపు సొంపారఁగన్.
భావము:
ఓ రాజోత్తమా! పూర్వం నీవు క్షాత్రధర్మం అవలంబించి వేటమొదలైన వేడుకలతో జంతువులను చంపావు. కనుక, తపస్సు చేసి ఆ పాపం బాపుకో. మరుసటి జన్మలో బ్రాహ్మణుడవై ప్రాణులందు మైత్రి కలిగి నన్ను పొందగలవు.” అని శ్రీహరి అతనికి సెలవు ఇచ్చాడు. ముచుకుందుడు మురవైరికి ప్రదక్షిణంచేసి, ప్రణమిల్లి, గుహనుంచి వెలుపలికి వచ్చాడు. అతడు మనుష్యులు పశువులు చెట్లు తీగలు అల్పపరిమాణాలై ఉండడం చూసాడు. కలియుగం రాబోతున్నదని తెలిసికొని, ఉత్తరదిక్కుకు బయలుదేరి వెళ్ళాడు. ఆయన తపోదీక్ష వహించి అనుమానాలు వదలిపెట్టి అన్నిటి యందు ఆసక్తి మాని శ్రీహరి మీద మనసు లగ్నంచేసి గంధమాదన పర్వతాన్ని ప్రవేశించాడు. అక్కడ నుండి నరనారాయణులకు నెలవైన బదరికాశ్రమాన్ని చేరి శాంతుడై విష్ణుమూర్తిని ఆరాధించసాగాడు. అలా ముచుకుందుడిని పంపిన, పద్మముల వంటి కన్నులు కల శ్రీకృష్ణుడు లోపం లేని ప్రతాపమనే భానుతేజంతో దిగంతరాలను కప్పివేస్తూ మరల మథురానగరానికి విచ్చేసాడు. అతడు పట్టణము అంతటినీ చక్రాకారంతో ఆవరించి ముట్టడించి ఉన్న యవనులు అందరినీ యుద్ధభూమిలో గొప్పదనం అతిశయించేలా నిర్మూలించాడు.
http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=199&padyam=1667
: : భాగవతం చదువుకుందాం : :
: : తెలుగులో మాట్లాడుకుందాం : :
No comments:
Post a Comment