Saturday, 13 February 2021

శ్రీకృష్ణ విజయము - 150

( జరాసంధుడు గ్రమ్మర వేయుట )

10.1-1668-వ.
ఇట్లు మ్లేచ్ఛులం బొరిగొని మఱియు న మ్మథురానగరంబునం గల ధనంబు ద్వారకానగరంబునకుం బంచిన మనుష్యులు గొనిపోవు నెడ.
10.1-1669-సీ.
ఘోటకసంఘాత ఖురసమున్నిర్గత-
  ధూళి జీమూత సందోహముగను
మహనీయ మదకల మాతంగ కటదాన-
  ధారలు కీలాలధారలుగను
నిరుపమ స్యందననేమి నిర్ఘోషంబు-
  దారుణ గర్జిత ధ్వానముగను
నిశిత శస్త్రాస్త్ర మానిత దీర్ఘరోచులు-
  లలిత సౌదామినీ లతికలుగను
10.1-1669.1-తే.
శత్రురాజ ప్రతాపాగ్ని శాంతముగను
వృష్టికాలము వచ్చు న వ్విధముఁ దోఁప
నేగుదెంచె జరాసంధుఁ డిరువదియును
మూడు నక్షౌహిణులు దన్ను మొనసి కొలువ.

భావము:
అలాగ మ్లేచ్ఛులను సంహరించి మథురానగరంలో ఉండే సిరిసంపదలను ద్వారకానగరానికి తరలించడానికి మనుషులను ఏర్పాటు చేసాడు.అలా వారు ఆ సంపదలను పట్టుకు వెళుతున్న సమయంలో జరాసంధుడు ఇరవైమూడు అక్షౌహిణుల సేనతో మథుర మీదకి దండెత్తి వచ్చాడు; అతడి గుఱ్ఱాల గుంపుల డెక్కల వలన రేగిన దుమ్ము మబ్బుల గుంపులా ఉంది; బాగా పెద్దవైన మదపుటేనుగుల చెక్కిళ్ళనుండి స్రవించే మదజలధారలు వర్షజలధారలను మించాయి; కదిలే రథచక్రాల రొద ఘోరమైన ఉరుముల మ్రోతలా అనిపించింది; వాడి శస్త్రాస్త్రాల పెనుకాంతులు మెరిసే మెఱుపుతీగలను పోలాయి; శత్రురాజుల శౌర్యాగ్నిని చల్లార్చే వర్షాకాలం మాదిరి అతడి సైన్యం గోచరించింది;

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.1&Ghatta=200&padyam=1669

: : భాగవతం చదువుకుందాం : : 

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...