Wednesday, 3 March 2021

శ్రీకృష్ణ విజయము - 164

( రతీప్రద్యుమ్నులాగమనంబు )

10.2-27-క.
కొందఱు హరి యగు నందురు,
కొందఱు చిహ్నములు కొన్నికొన్ని హరికి లే
వందురు, మెల్లనె తెలియుద
మందురు మరుఁ జూచి కొంద ఱబలలు గుములై.
10.2-28-క.
హరి యని వెనుచని పిదపన్
హరిఁ బోలెడువాఁడు గాని హరి గాఁ డనుచున్
హరిమధ్య లల్లనల్లన
హరినందను డాయ వచ్చి రాశ్చర్యమునన్.
10.2-29-ఉ.
అన్నులు సేర వచ్చి మరు నందఱుఁ జూడఁగఁ దాను వచ్చి సం
పన్న గుణాభిరామ హరిపట్టపుదేవి విదర్భపుత్రి క్రే
గన్నుల నా కుమారకుని కైవడి నేర్పడఁ జూచి బోటితోఁ
జన్నులు సేఁప నిట్లనియె సంభ్రమదైన్యము లుల్లసిల్లఁగన్.

భావము:
ప్రద్యుమ్నుడిని చూసిన కొందరు స్త్రీలు “శ్రీ కృష్ణుడే” అని అనగా, మరికొందరు “శ్రీకృష్ణునిలో ఇతని లక్షణాలు కొన్ని లే”వని అన్నారు. ఇంకా కొందరు “నెమ్మదిగా ఈ విషయం తెలుసుకుందా”మని గుంపులు గుంపులుగా చేరి “శ్రీకృష్ణుడే” అని కొంతదూరం వెళ్ళి, “శ్రీకృష్ణుడిలా ఉన్నాడే కాని శ్రీకృష్ణుడు కా” డని అంటూ అంతఃపుర స్త్రీలు ఆశ్చర్యపోతూ శ్రీకృష్ణుడి కుమారు డైన ప్రద్యుమ్నుడిని సమీపించారు. స్త్రీ లందరూ ప్రద్యుమ్నుడిని చూడటానికి రాగా శ్రీకృష్ణుని పట్టపుదేవి, విదర్భ రాకుమారి, సుగుణాలదీవి అయిన రుక్మిణీదేవి క్రీగంటితో ఆ పిల్లవాని రూపురేఖలను చూసి పాలిండ్లు చేపగా దైన్య సంభ్రమాలు ముప్పిరిగొనగా చెలికత్తెతో ఇలా అంది.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=4&Padyam=29

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...