Wednesday, 3 March 2021

శ్రీకృష్ణ విజయము - 165

( రతీప్రద్యుమ్నులాగమనంబు )

10.2-30-శా.
"ఈ కంజేక్షణుఁ డీ కుమారతిలకుం డీ యిందుబింబాననుం
డీ కంఠీరవమధ్యుఁ డిచ్చటికి నేఁ డెందుండి యేతెంచెనో
యీ కల్యాణునిఁ గన్న భాగ్యవతి మున్నే నోములన్ నోఁచెనో
యే కాంతామణియందు వీని కనెనో యేకాంతుఁ డీ కాంతునిన్.
10.2-31-శా.
ఆళీ! నా తొలుచూలి పాపనికి బోర్కాడించి నే సూతికా
శాలామధ్య విశాలతల్పగత నై చన్నిచ్చి నిద్రింప నా
బాలున్ నా చనుఁబాలకుం జెఱిచి యే పాపాత్ములే త్రోవ ము
న్నే లీలం గొనిపోయిరో? శిశువుఁ దా నే తల్లి రక్షించెనో!
10.2-32-క.
కొడుకఁడు నా పొదిగిఁటిలోఁ
జెడిపోయిన నాఁటనుండి చెలియా! తెలియం
బడ దే వార్తయు నతఁడే
వడువున నెచ్చోట నిలిచి వర్తించెడినో!

భావము:
ఈ చక్కటి పిల్లాడు, పద్మనేత్రుడు, చంద్రముఖుడు, సింహమధ్యముడు ఇక్కడకు ఎక్కడ నుండి వచ్చాడో. ఈ బాలుడిని కన్న భాగ్యవతి పూర్వజన్మలో ఏ నోములు నోచిందో? ఏ అందగాడు ఏ అందగత్తె యందు ఈ అందగాడిని కన్నాడో? ఓ చెలీ! నా తొలిచూలు బాలుడికి స్నానం చేయించి పురిటిగదిలో మంచంపై పడుకుని చన్నిచ్చి నిద్రపోతున్న సమయంలో, ఏ పాపాత్ములు నా పుత్రుడిని నా చనుబాలకు దూరంచేసి ఏవిధంగా దొంగిలించుకుని పోయారో? ఆ పిల్లవాడిని ఏ చల్లనితల్లి రక్షించిందో? చెలీ! నా కుమారుడు నా పొత్తిళ్ళ నుండి దూరమైన రోజు నుండి ఏ కబురూ తెలియరాలేదు. వాడు ఎక్కడ ఉన్నాడో, ఎలా ఉన్నాడో కదా!

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=4&Padyam=32

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...