Friday, 5 March 2021

శ్రీకృష్ణ విజయము - 166

( రతీప్రద్యుమ్నులాగమనంబు )

10.2-33-క.
ఇందాఁక వాఁడు బ్రదికిన
సందేహము లేదు దేహచాతుర్యవయ
స్సౌందర్యంబుల లోకులు
వందింపఁగ నితనియంతవాఁ డగుఁ జుమ్మీ!
10.2-34-మ.
అతివా! సిద్ధము నాఁటి బాలకున కీ యాకార మీ వర్ణ మీ
గతి యీ హాసవిలోకనస్వరము లీ గాంభీర్య మీ కాంతి వీఁ
డతఁడే కాఁదగు నున్నవారలకు నా యాత్మేశు సారూప్య సం
గతి సిద్ధింపదు; వీనియందు మిగులం గౌతూహలం బయ్యెడిన్.
10.2-35-క.
పొదలెడి ముదమునఁ జిత్తము
గదలెడి నా యెడమమూఁపు, గన్నుల వెంటం
బొదలెడి నానందాశ్రులు
మెదలెడిఁ బాలిండ్లఁ బాలు; మేలయ్యెడినో!"

భావము:
ఇప్పటిదాకా నా కొడుకు బ్రతికే ఉండి ఉంటే ఇలా చక్కటి రూపు, వయస్సు, అందచందాలతో లోకులు పొగిడేలా, ఈతడి అంతటి వాడై ఉండే వాడు సుమా! మగువా! ఆనాటి నా కొడుక్కి ఈ రూపం; ఈ రంగూ; ఈ నవ్వూ; ఈ చూపులు; ఈ కంఠస్వరం; ఈ గంభీర్యం; ఈ కాంతి ఉండి ఉండేవి. ఇతడు నా పుత్రుడే అయ్యుండాలి, లేకపోతే వేరేవాడిలో నా భర్త శ్రీకృష్ణుడి పోలికలు ఎందుకుంటాయి. ఇతడి మీద నాకు ఎంతో అభిమానం కలుగుతోంది కూడా! ఆనందంతో నా హృదయం ఉప్పొంగుతోంది. నా ఎడమ బుజం అదురుతోంది. కళ్ళనుండి ఆనందాశ్రువులు రాలుతున్నాయి. పాలిండ్లలో పాలు జాలువారుతున్నాయి. ఏం మేలు జరుగబోతుందో?

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=4&Padyam=35

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...