Tuesday, 16 March 2021

శ్రీకృష్ణ విజయము - 170

( రతీప్రద్యుమ్నులాగమనంబు )

10.2-45-క.
"సత్రాజిత్తు నిశాచర
శత్రునకుం గీడు సేసి సద్వినయముతోఁ
బుత్రి, శమంతకమణియును
మైత్రిం గొని తెచ్చి యిచ్చె మనుజాధీశా! "
10.2-46-వ.
అనిన విని రా జిట్లనియె.
10.2-47-ఆ.
"శౌరి కేమి తప్పు సత్రాజితుఁడు సేసెఁ?
గూఁతు మణిని నేల కోరి యిచ్చె?
నతని కెట్లు కలిగె నా శమంతకమణి
విప్రముఖ్య! నాకు విస్తరింపు. "

భావము:
“ఓ పరీక్షిత్తు మహారాజా! సత్రాజిత్తు శ్రీకృష్ణుడి పట్ల అపచారం చేసాడు. పిమ్మట పశ్చాత్తాప పడి, మంచి వినయంతో శమంతకమణినీ తన పుత్రికామణినీ మైత్రీభావంతో తీసుకువచ్చి సమర్పించాడు.” అని శుకమహర్షి చెప్పగా వినిన పరీక్షిన్నరేంద్రుడు ఇలా అన్నాడు. “ఓ మునీంద్రా! శ్రీకృష్ణుడిపట్ల సత్రాజిత్తు ఏమి అపరాధం చేసాడు. శమంతకమణినీ తన కూతురుని ఎందుకు కోరి కోరి ఇచ్చాడు. అతనికి శమంతకమణి ఎలా దొరికింది. ఈ విశేషాలన్నీ నాకు వివరంగా చెప్పండి.”

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=4&Padyam=47

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...