Tuesday, 16 March 2021

శ్రీకృష్ణ విజయము - 171

( శమంతకమణి పొందుట )

10.2-48-వ.
అనిన విని శుకయోగివర్యుం డిట్లనియె. "సత్రాజిత్తనువాఁడు సూర్యునకు భక్తుండై చెలిమి, సేయ నతనివలన సంతసించి సూర్యుండు శమంతకమణి నిచ్చె; నా మణి కంఠంబున ధరియించి సత్రాజిత్తు భాస్కరుని భంగి భాసమానుం డై ద్వారకానగరంబునకు వచ్చిన; దూరంబున నతనిం జూచి జనులు మణిప్రభాపటల తేజోహృతదృష్టులయి సూర్యుం డని శంకించి వచ్చి; హరి కిట్లనిరి.
10.2-49-క.
"నారాయణ! దామోదర!
నీరజదళనేత్ర? చక్రి! నిఖిలేశ! గదా
ధారణ! గోవింద! నమ
స్కారము యదుపుత్త్ర! నిత్యకల్యాణనిధీ!
10.2-50-మ.
దివిజాధీశ్వరు లిచ్చగింతురు గదా దేవేశ! నిన్ జూడ యా
దవ వంశంబున గూఢమూర్తివి జగత్త్రాణుండవై యుండఁగా
భవదీయాకృతిఁ జూడ నేఁడిదె రుచిప్రచ్ఛన్న దిగ్భాగుఁడై
రవియో, నీరజగర్భుఁడో యొకఁడు సేరన్ వచ్చె మార్గంబునన్. "

భావము:
రాజు పరీక్షిత్తు ఇలా అడుగగా శుకయోగి ఈలా చెప్పసాగాడు. ”సత్రాజిత్తు సూర్యుడిని భక్తితో ఆరాధించాడు. సూర్యుడు అతడి భక్తికి మెచ్చి సంతోషించి అతడికి శమంతకమణిని ఇచ్చాడు. ఆ మణిని కంఠంలో ధరించి సత్రాజిత్తు సూర్యునిలా వెలిగిపోతూ ద్వారకకి వచ్చాడు. ద్వారకానివాసులు ఆ మణి కాంతులకు కన్నులుమిరుమిట్లు గొలుపగా సూర్యుడని భ్రాంతిపడి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి ఇలా విన్నవించారు. “నారాయణా! దామోదరా! పుండరీకాక్షా! చక్రాయుధా! సర్వేశ్వరా! గదాధారీ! గోవిందా! యదునందనా! నిత్యకల్యాణనిధి! నీకు నమస్కారం. ఓ దేవాధిదేవా! నీ దర్శనాన్ని దేవతలు సైతం కోరుకుంటారు. యాదవవంశంలో అవతరించి జగద్రక్షుకుడవై ఉన్న నిన్ను సకల దిక్కులలోనూ కాంతులు వెదజల్లుతూ సూర్యుడో, బ్రహ్మదేవుడో, ఎవడో నిన్ను దర్శించడానికి వస్తున్నాడు."

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=5&Padyam=50

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...