Thursday 15 April 2021

శ్రీకృష్ణ విజయము - 199

( అర్జునితో మృగయావినోదంబు )

10.2-119-మ.
"నరవీరోత్తమ! యేను సూర్యుని సుతన్; నాపేరు కాళింది; భా
స్కర సంకల్పితగేహమందు నదిలోఁ గంజాక్షు విష్ణుం బ్రభున్
వరుగాఁ గోరి తపంబుసేయుదు; నొరున్ వాంఛింపఁ; గృష్ణుండు వ
న్యరతిన్ వచ్చి వరించునంచుఁ బలికెన్ నా తండ్రి నాతోడుతన్. "
10.2-120-వ.
అనిన విని ధనంజయుఁ డా నీలవేణి పలుకులు హరికిం జెప్పిన విని సర్వజ్ఞుండైన హరియు హరిమధ్యను రథంబుమీఁద నిడుకొని ధర్మరాజు కడకుం జని వారలు గోరిన విశ్వకర్మను రావించి వారి పురం బతివిచిత్రంబు సేయించె.
10.2-121-క.
దేవేంద్రుని ఖాండవ మ
ప్పావకునకు నీఁ దలంచి పార్థుని రథికుం
గావించి సూతుఁ డయ్యెను
గోవిందుఁడు మఱఁదితోడఁ గూరిమి వెలయన్.

భావము:
“ఓ వీరాధివీరా! నేను సూర్యుడి కుమార్తెను. నా పేరు కాళింది. ఈ నదిలో నా తండ్రి నా కోసం ఏర్పాటుచేసిన గృహంలో పద్మాక్షుడైన శ్రీకృష్ణుడిని భర్తగా కోరి తపస్సు చేస్తున్నాను. ఇంకెవరినీ నేను కోరను. శ్రీకృష్ణుడు వేటకు వచ్చి నిన్ను వివాహమాడగల డని నా తండ్రి నాకు తెలిపాడు." అలా చెప్పిన కాళింది మాటలను అర్జునుడు శ్రీకృష్ణుడికి విన్నవించాడు. సర్వజ్ఞుడైన హరి ఆ సన్నని నడుము కల కాళింది సుందరిని రథముపై ఎక్కించుకుని, ధర్మరాజు దగ్గరకు వెళ్ళాడు. పాండవులు కోరగా విశ్వకర్మ వచ్చి ఇంద్రప్రస్థపురాన్ని చిత్రవిచిత్రంగా అలంకరించి తీర్చిదిద్దాడు. దేవేంద్రుని ఖాండవవనాన్ని అగ్నిదేవుడికి అర్పించడానికి నిశ్చయించుకుని మేనత్త కొడుకు అర్జునుడిని సస్నేహంగా పిలిచి, అతని రథానికి శ్రీకృష్ణుడు తాను సారథి అయ్యాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=15&Padyam=121

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...