Thursday 15 April 2021

శ్రీకృష్ణ విజయము - 200

( అర్జునితో మృగయావినోదంబు )

10.2-122-వ.
ఇట్లు నర నారాయణులు సహాయులుగా దహనుండు ఖాండవవనంబు దహించిన సంతసించి విజయునకు నక్షయ తూణీరంబులు, నభేద్యకవచంబును, గాండీవమనియెడి బాణాసనంబును దివ్యరథంబును ధవళరథ్యంబులను నిచ్చె నందు.
10.2-123-ఉ.
వాసవసూనుచేఁ దనకు వహ్నిశిఖాజనితోగ్రవేదనల్
పాసినఁ జేసి యొక్క సభ పార్థున కిచ్చె మయుండు ప్రీతుఁడై
యా సభలోనఁ గాదె గమనాగమనంబులఁ గౌరవేంద్రుఁ డు
ల్లాసముఁ బాసి యుండుట జలస్థలనిర్ణయ బుద్ధి హీనుఁడై.

భావము:
నరనారాయణుల సహాయంతో అగ్నిదేవుడు ఖాండవవనాన్ని దహించి, సంతోషించి అర్జునుడికి అక్షయ తూణీరాలు, భేదించడానికి వీలు లేని కవచం, గాండీవ మనే ధనుస్సు, దివ్యమైన రథమూ, తెల్లని గుఱ్ఱాలు అనుగ్రహించాడు. ఖాండవ వన దహన సమయంలో, అగ్నిజ్వాలల బాధనుండి తప్పించి ఇంద్రుడి పుత్రుడు అర్జునుడు తనను రక్షించినందు వలన, మయుడు సంతోషంతో ఒక మహాసభను నిర్మించి ఆ కుంతీపుత్రుడైన అర్జునుడికి బహుకరించాడు. ఆ సభ లోనే దుర్యోధనుడు సంచరిస్తూ గచ్చుకీ, జలాశయానికీ తేడా తెలియక అవమానం పొందాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=15&Padyam=123

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...