Thursday, 17 June 2021

శ్రీకృష్ణ విజయము - 261

( రుక్మిణిదేవి స్తుతించుట )

10.2-261-ఆ.
పృథు రజోగుణప్రవృద్ధమైనట్టి నీ
దృష్టిచేత నన్నుఁ దేఱుకొనఁగఁ
జూచు టెల్ల పద్మలోచన! నా మీఁద
ఘనదయార్ద్రదృష్టిగాఁ దలంతు.
10.2-262-వ.
అదియునుంగాక, మధుసూదనా! నీవాక్యంబులు మిథ్యలుగావు; తల్లి వచనంబు కూఁతున కభిమతంబుగాదె? యౌవనారూఢమదంబున స్వైరిణి యగు కామిని పురుషాంతరాసక్త యగుట విచారించి పరిజ్ఞాని యైనవాఁడు విడుచు; నవివేకి యయిన పురుషుం డింద్రియలోలుండై రతిం దగిలి దాని విడువనేరక పరిగ్రహించి యుభయలోకచ్యుతుండగు; నట్లుగావున నీ యెఱుంగని యర్థంబు గలదే?” యని విన్నవించిన రుక్ష్మిణీదేవి వచనంబులకుఁ గృష్ణుండు సంతసిల్లి యిట్లనియె.

భావము:
రాజీవలోచనా! శ్రీకృష్ణా! రాజసంతో విరాజిల్లే నీ దృష్టితో నన్ను తేరుకొనేటట్లు చూడడం నన్ను దయార్ద్రదృష్టితో చూడడం గానే భావిస్తాను. ఓ కృష్ణా! నీ వాక్యాలు అసత్యాలు కావు కన్నతల్లి మాట గారాబు కుమార్తెకు అభిమతమేకదా యౌవనమదంతో స్వైరిణియైన కామిని అన్యపురుషాసక్త అయితే జ్ఞానవంతుడు ఆమెను పరిత్యజిస్తాడు. అవివేకి ఇంద్రియలోలత్వంతో ఆ స్త్రీని విడువలేక ఇహపర లోకాలు రెండింటికి భ్రష్టు డౌతాడు. అందువలన నీకు తెలియని ధర్మం లేదు.” అని రుక్మిణి విన్నవించింది. కృష్ణుడు ఎంతో సంతోషించి, ఇలా అన్నాడు.

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=26&Padyam=262

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...