Sunday, 20 June 2021

శ్రీకృష్ణ విజయము - 262

( రుక్మిణీదేవి నూరడించుట )

10.2-263-చ.
"అలికులవేణి! నవ్వులకు నాడినమాటల కింత నీ మదిం
గలఁగఁగ నేల? వేఁటలను గయ్యములన్ రతులందు నొవ్వఁగాఁ
బలికినమాట లెగ్గు లని పట్టుదురే? భవదీయ చిత్తముం
దెలియఁగఁ గోరి యేఁ బలికితిన్ మదిలో నిటు గుంద నేఁటికిన్?
10.2-264-వ.
అని మఱియు నిట్లనియె.
10.2-265-ఉ.
కింకలు ముద్దుఁబల్కులును గెంపుఁగనుంగవ తియ్యమోవియున్
జంకెలు తేఱిచూపు లెకసక్కెములున్ నెలవంక బొమ్మలుం
గొంకక వీడనాడుటలుఁ గూరిమియుం గల కాంతఁ గూడుటల్‌
అంకిలి లేక జన్మఫల మబ్బుట గాదె కురంగలోచనా! "
10.2-266-వ.
అని మఱియు నిట్లనియె.

భావము:
“తుమ్మెదల బారు వంటి శిరోజాలు గల సుందరీ! రుక్మిణీ! నేను నవ్వులాటకు అన్న మాటలకు నీవు ఎందుకు ఇంత బాధపడుతున్నావు. వేట, రణరంగం, రతి సమయాలలో, సూటిపోటి మాటలు మాట్లాడినా తప్పుగా భావించరాదు. నీ మనస్సు తెలుసుకోవడం కోసం ఇలా అన్నాను. ఈ పాటిదానికి నీవు బాధచెంద వద్దు. అదీకాక హరిణలోచనాల సుందరీ! రుక్మిణీ! కినుకలు, మురిపెపు మాటలు, బెదరింపు చూపులు, తియ్యని కెమ్మోవి, ఎకసెక్కాలు, నకక్షతములు, విదిలింపులు, అదలింపులు గల వలపుల చెలువలతో సమాగమం లభిస్తే జన్మ సఫలమైనట్లే కదా!” అని అంటూ ఇంకా ఇలా అనునయించసాగాడు....

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=27&Padyam=265

: : తెలుగులో మాట్లాడుకుందాం : :

: : భాగవతం చదువుకుందాం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...