Wednesday, 1 December 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౧(411)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-872-చ.
వెరవును లావుఁ జేవయును వీరముఁ బీరము గల్గి డాసి యా
సరసిజనాభనందను విశాలభుజాంతరముం బగిల్చినన్
విరవిరవోయి మేను నిడువెండ్రుక వెట్టఁగఁ జేతిఁ సాధనో
త్కరములు దేరిపై వదలి కన్నులుమూయుచు మూర్ఛనొందినన్
10.2-873-ఆ.
సమరధర్మ వేది సమధిక నయవాది
దారుకుని సుతుండు ధైర్యయుతుఁడు
రథముఁ దోలికొనుచు రణభూమి వెడలి వే
చనియె మూర్ఛదేఱి శంబరారి. 

భావము:
నేర్పూ బలపరాక్రమాలూ ప్రదర్శిస్తూ ద్యుముడు గదతో కృష్ణకుమారుడు ప్రద్యుమ్నుడి వక్షం పగిలేలా మోదాడు. ఆ దెబ్బకి అతడు మేను గగుర్పడంతో చేతిలోని అస్త్రశస్త్రాలను రథంమీదనే వదిలి కనులు మూతలు పడి మూర్ఛపోయాడు. సారథి దారకుని కుమారుడు; యుద్ధధర్మం చక్కగా తెలిసినవాడు; నీతిశాస్త్ర పారంగతుడు; కనుక, రథాన్ని మళ్ళించి యుద్ధభూమినుండి ప్రక్కకు తోలుకుని పోయాడు. కొంతసేపటికి ప్రద్యుమ్నుడు మూర్ఛ నుండి తేరుకున్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=873 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Tuesday, 30 November 2021

శ్రీకృష్ణ విజయము - ౪౧౦(410)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-869-క.
స్ఫురదనలాభశరంబులు
పొరిఁబొరి బుంఖానుపుంఖములుగా నేయం
దెరలియు మరలియు మురిసియు
విరిసియుఁ బిఱుతివక పోరె వెస యదుబలముల్‌.
10.2-870-క.
అయ్యెడ మానము వదలక
డయ్యక మగపాడితో దృఢంబుగఁ బోరన్
దయ్య మెఱుంగును? నెక్కటి
కయ్యం బపుడయ్యెఁ బేరుగల యోధులకున్.
10.2-871-క.
మును ప్రద్యుమ్నకుమారుని
ఘననిశితాస్త్రములచేతఁ గడు నొచ్చిన సా
ల్వుని మంతిరి ద్యుమనాముఁడు
సునిశిత గదచే నమర్చి సుమహితశక్తిన్. 

భావము:
అప్పుడు, సాల్వుడు యాదవసైన్యంమీద అగ్నిజ్వాల ల్లాంటి బాణాలను పింజ పింజతాకేలా వేసాడు. అయినా ఆ సైన్యం చెదరక బెదరక వెనుకంజ వేయక ధైర్యంతో నిలచి యుద్ధం చేసింది. ఆ సమయంలో రెండు పక్షాల యోధులూ నదురూ బెదురూ లేకుండా, అలసిపోకుండా గట్టిగా పౌరుషంతో పోరాడారు. అప్పుడు ప్రసిద్ధులైన యోధుల మధ్య ద్వంద్వ యుద్ధం జరగసాగింది. మునుపు ప్రద్యుమ్నుడి బాణాల వలన మిక్కిలి నొచ్చిన సాల్వుడి మంత్రి ద్యుముడు అనేవాడు గదను ధరించి ప్రద్యుమ్నుడిని ఎదుర్కున్నాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=870 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Monday, 29 November 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౯(409)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-867-సీ.
ఒకమాటు నభమునఁ బ్రకటంబుగాఁ దోఁచు-
  నొకమాటు ధరణిపై నొయ్య నిలుచు
నొకమాటు శైలమస్తకమున వర్తించు-
  నొకపరిఁ జరియించు నుదధినడుమ
నొక్క తోయంబున నొక్కటియై యుండు-
  నొక్కెడఁ గనుఁగొనఁ బెక్కు లగును
నొకమాటు సాల్వసంయుక్తమై పొడసూపు-
  నొక తోయ మన్నియు నుడిగి తోఁచు
10.2-867.1-ఆ.
నొక్కతేప కొఱవి యుడుగక త్రిప్పిన
గతి మహోగ్రవృత్తిఁ గానవచ్చు
మఱియుఁ బెక్కుగతుల నరివరుల్‌ గలఁగంగఁ
దిరిగె సౌభకంబు ధీవరేణ్య!
10.2-868-వ.
ఇవ్విధంబున సౌభకంబు వర్తించుటం జేసి యదుసైన్యంబులచే దైన్యంబు నొందిన నిజసైన్యంబుల మరలం బురికొల్పి సాల్వుం డప్పుడు. 

భావము:
పరీక్షన్మహారాజా! ఆ సౌభకవిమానం తన మాయా ప్రభావంతో ఒకమారు ఆకాశంలో కనపడుతుంది; ఒకమారు భూమి మీద నిలబడుతుంది; ఒకమారు కొండశిఖరం మీద తిరుగుతుంది; ఒకమారు సముద్రమధ్యంలో విహరిస్తుంది; ఒకసారి ఒక్కటిగా, మరుక్షణంలో అనేక రూపాలతో ప్రత్యక్షమవుతుంది; ఒకతూరి సాల్వుడితో కూడి చూపట్టుతుంది; ఒకమారు ఏమీ లేకుండా కనపడుతుంది; ఒకమారు కొఱవి తిప్పినట్లుగా భయంకరంగా దర్శనమిస్తుంది; ఈ విధంగా ఆ విమానం శత్రువులు కలవరపడేటట్లు పెక్కువిధాలుగా తిరిగింది.ఇలా సౌభకవిమానం విజృంభించేసరికి అంతకు ముందు యాదవసైన్యంవల్ల భీతిచెందిన తన సైన్యాల్ని సాల్వుడు మళ్ళీ పురిగొల్పి యుద్ధోన్ముఖులను చేసాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=867 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Saturday, 27 November 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౮(408)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-864-క.
అక్రూరుఁడుఁ దదనుజులు న
వక్రపరాక్రమము మెఱసి వైరుల బాహా
విక్రమమున వధియించిరి
చక్రప్రాసాది వివిధ సాధనములచేన్.
10.2-865-మ.
కృతవర్మక్షితినాయకుండు విశిఖశ్రేణిం బ్రమత్తార్యధి
శ్రితవర్మంబులఁ జించి మేనుల శతచ్ఛిద్రంబులం జేయ న
ద్భుతకర్మం బని సైనికుల్‌ వొగడ శత్రుల్‌ దూలుచో సంగర
క్షితిధర్మంబుఁ దలంచి కాచె రథికశ్రేష్ఠుండు భూమీశ్వరా!
10.2-866-వ.
అయ్యవసరంబున సాల్వుండు గోపోద్దీపితమానసుండై యుండ మాయావిడంబకంబైన సౌభకం బప్పుడు. 

భావము:
అక్రూరుడూ అతని తమ్ముళ్ళూ తిరుగులేని పరాక్రమంతో మెరసి ఈటె, చక్రము మున్నగు రక రకాల సాధనాల ప్రయోగంతో శత్రువులను వధించారు. ఓ పరీక్షిన్మహారాజా! రాజు కృతవర్మ శత్రువుల కవచాలు భేదించి, వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికాడు. ఇది అద్భుతమైన కార్యమని శత్రువులు సైతం పొగిడారు. రథికోత్తముడు అయిన అతడు యుద్ధధర్మాన్ని అవలంబించి విరోధులు పారిపోతుంటే వారిని చంపకుండా వదలిపెట్టాడు. అప్పుడు, సాల్వుడికి బాగా కోపం వచ్చింది. అతడి సౌభకవిమానం తన మాయాప్రభావంతో విజృంభించింది. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=865 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Friday, 26 November 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౭(407)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-861-ఉత్సా.
చారుదేష్ణుఁ డాగ్రహించి శత్రుభీషణోగ్ర దో
స్సారదర్ప మేర్పడన్ నిశాత బాణకోటిచే
దారుణప్రతాప సాల్వదండనాథమండలిన్
మారి రేఁగినట్లు పిల్కుమార్చి పేర్చి యార్చినన్.
10.2-862-క.
శుకుఁ డా యోధన విజయో
త్సుకమతి బాహాబలంబు సొప్పడ విశిఖ
ప్రకరంబులఁ దను శౌర్యా
ధికుఁ డన విద్వేషిబలతతిం బరిమార్చెన్.
10.2-863-ఉ.
సారణుఁ డేపుమైఁ గదిసి శాత్రవవీరులు సంచలింప దో
స్సార మెలర్పఁ గుంత శర శక్తి గదా క్షురికాది హేతులన్
వారక వాజి దంతి రథవర్గములం దునుమాడి కాల్వురన్
వీరముతోడఁ బంపె జమువీటికిఁ గాఁపుర ముగ్రమూర్తియై. 

భావము:
చారుదేష్ణుడు ఆగ్రహంతో విజృంభించి వాడి బాణాలు అనేకం ప్రయోగించి సాల్వుని దండనాథులను సంహరించి సింహనాదం చేసాడు. యోధుడైన శుకుడు యుద్ధవిజయకాంక్షతో చెలరేగి తన భుజబలం విశదం అయ్యేలా శరసమూహంతో శత్రు సేనావ్యూహాన్ని నాశనం చేసాడు. సారణుడు విజృంభించి శత్రువీరులు తన బాహుబలానికి శత్రువులు భయపడేలాగా కుంతాలూ, శక్తులూ, బాణాలూ, గదలూ, కత్తులూ మొదలైన ఆయుధాలతో సాల్వుడి గుఱ్ఱాలను ఏనుగులను రథాలను ధ్వంసం చేసి ఉగ్రస్వరూపుడు అయి శౌర్యంతో సైనికులను సంహరించాడు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=863 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Thursday, 25 November 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౬(406)

( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-859-ఉ.
సాత్యకి చండరోషమున సాల్వమహీవరు భూరిసౌభ సాం
గత్య చతుర్విధోగ్రబలగాఢతమఃపటలంబు భాసురా
దిత్యమయూఖపుంజరుచితీవ్రశరంబులఁ జూపి సైనిక
స్తుత్యపరాక్రమప్రకటదోర్బలుఁడై విలసిల్లె భూవరా!
10.2-860-ఉత్సా.
భానువిందుఁ డుద్ధతిన్ విపక్షపక్షసైన్య దు
ర్మాన కాననానలోపమాన చండ కాండ సం
తాన మూన నేసి చూర్ణితంబు చేసెఁ జాప వి
ద్యా నిరూఢి దేవతావితాన మిచ్చ మెచ్చఁగాన్. 

భావము:
ఓ రాజశ్రేష్ఠుడా! సాత్యకి మహారోషంతో సాల్వుడి చతురంగబలాలను, సౌభక విమానము అనే చీకటిని సూర్యకిరణాల వంటి వాడి యైన బాణాలను ప్రయోగించి పటాపంచలు కావించాడు. సైనికులందరు అతని పరాక్రమాన్ని బహువిధాల ప్రశంసించారు. భానువిందుడు విజృంభించి, శత్రుసైన్యం అనే అడవిని తీవ్రమైన దావానలం వంటి తన బాణాలు అసంఖ్యాకంగా వేసి భస్మీపటలం చేసాడు. అతని ధనుర్విద్యా కౌశల్యాన్ని దేవతా సమూహం ప్రస్తుతించింది. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=860 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

Wednesday, 24 November 2021

శ్రీకృష్ణ విజయము - ౪౦౫(405)( యదుసాల్వ యుద్ధంబు) 

10.2-857-ఉ.
సాంబుని సాల్వభూవిభుఁడు సాయకజాలము లేసి నొంచినన్
జాంబవతీతనూభవుఁడు చాపము సజ్యము సేసి డాసి సా
ల్వుం బదియేను తూపుల నవోన్నతవక్షము గాఁడనేసి శా
తాంబకవింశతిన్నతని సౌభక మల్లలనాడ నేసినన్.
10.2-858-చ.
గదుఁడు మహోగ్రవృత్తి నిజకార్ముక నిర్గతవిస్ఫురద్విధుం
తుదవదనాభబాణవితతుల్‌ పరఁగించి విరోధిమస్తముల్‌
గుదులుగ గ్రుచ్చియెత్తుచు నకుంఠిత విక్రమకేళిలోలుఁడై
చదల సురల్‌ నుతింప రథిసత్తముఁ డొప్పె నరేంద్రచంద్రమా! 

భావము:
సాల్వుడు సాంబుడి మీద అనేక బాణాలు ప్రయోగించి నొప్పించాడు. అంతట ఆ జాంబవతీ తనయుడు సాంబుడు తన ధనస్సు ఎక్కుపెట్టి సాల్వుడి వక్షాన్ని పదిహేను బాణాలతో కొట్టాడు. వాడి బాణాలు ఇరవై వేసి వాడి సౌభక విమానాన్ని అల్లల్లాడేలా చేసాడు. ఓ పరీక్షిత్తు రాజేంద్రా! గొప్ప రథికుడైన గదుడు రాహుముఖం లాంటి బాణాలను ప్రయోగించి శత్రువుల శిరస్సులు ఖండించి గుదులు గుదులుగా నేలకూలుస్తు మొక్కవోని పరాక్రమంతో విజృంభించాడు. ఆకాశంలో అతని పరాక్రమం చూసి దేవతలు ప్రస్తుతించారు. 

http://telugubhagavatam.org/?tebha&Skanda=10.2&Ghatta=64&Padyam=858 

: : తెలుగులో మాట్లాడుకుందాం : : 

: : భాగవతం చదువుకుందాం : :

శ్రీకృష్ణ విజయము - ౪౧౧(411)

( యదుసాల్వ యుద్ధంబు)  10.2-872-చ. వెరవును లావుఁ జేవయును వీరముఁ బీరము గల్గి డాసి యా సరసిజనాభనందను విశాలభుజాంతరముం బగిల్చినన్ విరవ...