"తమసోమా జ్యోతిర్గమయ, అసతోమా సద్గమయ, మృత్యోర్మా అమృతంగమయ'' అంటే చీకటి నుంచి వెలుగు వైపుగా, అశాశ్వతం నుంచి శాశ్వతం వైపుగా మృత్యువు నుంచి అమృతత్వం వైపుగా సాగిపోవడం మానవ ధర్మం అన్నది దీని భావార్థం. అప్పుడే ఈ జీవితానికి అర్థం, పరమార్థం చేకూరినట్లని, అలా అయితేనే, ఈ జీవుడు పరబ్రహ్మలో విలీనమై, మళ్లీ
జన్మకు రావలసిన పనిలేకుండా పోతుంది.
అయితే ఇక్కడ సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతుంది. అంతా పరబ్రహ్మ స్వరూపమే అయినప్పుడు ఈ జన్మపరంపరలోకి ఎందుకు వచ్చినట్లు? ఈ సృష్టి పరిణామానికి అర్థం ఏమిటి? వచ్చిన చోటికి తిరిగి వెళ్లడమే జీవితానికి ఏకైక పరమార్థం అయినప్పుడు అసలు రావడం ఎందుకు? ఎందరో మహనీయులు జీవన్ముక్తిని సాధించారు. భగవంతునిలో ఏకమై
ముక్తస్థితిని పొందారు. అమృతత్వాన్ని సాధించారు.
జీవన్ముక్తిని సాధించాక, ముక్తిధామం చేరుకునే
మధ్యకాలంలో తన చుట్టూ ఉన్న శిష్యకోటికి తమదైన
మార్గనిర్దేశం చేశారు. అది ఆనాటి ధర్మం.
అసలింతకూ ధర్మం అంటే ఏమిటి? సృష్టి పరిణామక్రమాన్ని సత్యపరంగా పట్టి ఉంచేదే ధర్మం. దానికి అడ్డుగా నిలిచేది అధర్మం. ఇది శక్యంకానప్పుడే దైవం అవతరించి ఆ అవరోధాన్ని తొలగిస్తాడు. అలా అవతరించిన వారే అవతారమూర్తులు.
(తెలుగు బాట నుండి...)
No comments:
Post a Comment