Sunday, 16 August 2015

ద్వారక అస్తమయం - 3:


(తెలుగు వికీపీడియా వారి సౌజన్యంతో )

సముద్రుడికి జాతర:

యాదవులకు శ్రీకృష్ణుడి ఆయుధములు , రధము ఆకాశముకు ఎగిరి పోయినా, వారి ఆయుధములు నాశనము అయినా, ఆభరణములు దొంగలు ఎత్తుకు పోయినా ఇసుమంత కూడ బాధ కలగలేదు. వారంతా మద్య మాంసములు భుజించడంలో మునిగిపోయారు. వివిధములైన భక్ష్య, భోజ్యములను తయారు చేసుకున్నారు. ఆహార పదార్ధములను, మద్యమును బండ్ల మీద ఎక్కించుకుని సముద్రతీరానికి బయలుదేరారు. అన్నీ తెలిసినా ఏమీ ఎరుగనట్లు శ్రీకృష్ణుడు వారి వెంట నిర్వికారముగా బయలుదేరాడు. బలరాముడు కూడా తన ఆభరణములను తీసివేసి నిరాడంబరముగా కాలి నడకన వారివెంట నడిచాడు. యాదవ స్త్రీలంతా చక్కగా అలంకారములు చేసుకుని పల్లకీలలో బయలుదేరారు. అందరూ సముద్రతీరానికి చేరుకున్నారు. అక్కడ ముందే వేసి ఉన్న పందిళ్ళలో కూర్చున్నారు.

ఉద్ధవుడు తపస్సు చేసుకుంటానని శ్రీకృష్ణుడికి చెప్పి హిమాలయాలకు వెళ్ళాడు. బలరాముడు ఒంటరిగా ఒక చెట్టు కింద కూర్చుని యోగ సమాధిలోకి వెళ్ళాడు. యాదవులు ఇవేమీ పట్టించుకోక మద్యమాంసములు సేవించి విచ్చలవిడిగా ప్రవర్తించసాగారు. బ్రాహ్మణ సంతర్పణకు తయారు చేసిన పదార్ధములను కోతులకు పంచి పెట్టారు. అవి తినడము చూసి కేరింతలు కొట్టసాగారు. మద్యమాంసములు సేవించి శరీరము స్వాధీనత తప్పేలా ప్రవర్తించ సాగారు.

యాదవులలో చెలరేగిన స్పర్థ:

యాదవ ప్రముఖులు అయిన సాత్యకి, కృతవర్మ, గదుడు, చారుదేష్ణుడు, ప్రద్యుమ్నుడు కూడా మద్యము సేవించి ఒకరితో ఒకరు పరిహాసాలు ఆడుకూంటున్నారు. అప్పుడు సాత్యకి కృతవర్మను చూసి రోషముగా " ఒరేయ్ కృతవర్మా ! శత్రువులైనా ! నిద్రించే సమయాన చచ్చిన వారితో సమానము. అలాంటి వారిని చంపడానికి ఏ నీచుడూ ప్రయత్నించడు. అలాంటిది ఈ కృతవర్మ అంతటి నీచకార్యానికి ఎలా ఒడిగట్టాడు రా ! ఏరా ప్రద్యుమ్నా ! అదీ ఒక వీరత్వమా ! అదీ ఒక శత్రుసంహారమా ! అది పాపకార్యమని నీకు తెలియదా ఏమి ? " అని హేళన చేసాడు. అప్పుడు ప్రద్యుమ్నుడు " ఎప్పుడో జరిగినదానికి ఇప్పుడు వాదన ఎందుకు పోనివ్వు. ఈ కృతవర్మ చేసిన దానికి ప్రజలు అందరూ ఇతడిని నానా తిట్లు తిడుతున్నారు.

ఇంకా మీరు ఎందుకు తిట్టడము " అని అన్నాడు. సాత్యకి అన్న దానికి కృతవర్మకు కోపము నఫాళానికి అంటింది " ఒరేయ్ సాత్యకి ! నీకు సిగ్గు లేదురా! నా సంగతి నేను చేసిన యుద్ధము సంగతి నీకు ఎందుకురా! నీ సంగతి నీవు చూసుకో. అర్జునుడు చేయి నరికినందుకు భూరిశ్రవుడు యోగ సమాధిలోకి వెళ్ళాడు. అటువంటి వాడి తల నరికిన విషయము అప్పుడే మరిచావా ! అదీ ఒక యుద్ధమేనా ! అప్పుడే ఆ విషయము మరిచావా ! పైగా శ్రీకృష్ణుడు కూడా పక్కనే ఉన్నాడు కదా " అన్నాడు. ఆ మాటలకు శ్రీకృష్ణుడికి కోపము వచ్చింది. కోపముగా కృతవర్మ వంక చూసాడు.

అప్పుడు " సాత్యకి " అన్నయ్యా ! వీడి సంగతి ఎవరికి తెలియదు. నాడు సత్రాజిత్తు వద్ద ఉన్న మణినికాజేయడానికి వీడు తమ్ముడు శతధ్వనుడితో చేరి సత్రాజిత్తును చంపలేదా ! " అని అన్నాడు. ఆ మాటాలు విన్నసత్యభామ తన తండ్రి మరణము గుర్తుకు వచ్చి ఏడుస్తూ కృష్ణుడి వద్దకు వచ్చింది. ఏడుస్తున్న ముద్దుల భార్యను చూసి శ్రీకృష్ణుడు కోపముతో ఊగిపోయాడు......( ఇంకా వుంది )

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...