హరితాళిక గౌరీ వ్రతం: ( 16-09-2015, బుధవారం )
కైలాస శిఖరంలో పార్వతి ఒకనాడు పరమశివుడిని ఇలా అడిగింది “స్వామీ! తక్కువ శ్రమతో, ధర్మాచరణతో ఎవరు నిను భక్తి శ్రద్ధలతో సేవిస్తారో వారికెలా ప్రసన్నుడవౌతావో తెలుపుమని ప్రార్థించింది. అంతేకాక, జగవూత్పభువైన మీరు నాకు యే తపోదానవ్రతమాచరించడం వల్ల లభించారు” అని అడిగింది.ప్రసన్నవదనంతో పరమశివుడు ‘‘దేవీ! వ్రతాల్లోకి చాలా ఉత్తమమైంది, అత్యంత రహస్యమైన వ్రతమొకటున్నది. దాన్ని ఎవరు ఆచరించినా నేను వారికి వశుడనైతాను. భాద్రపద శుక్లపక్షంలో హస్తనక్షత్రంతో కూడిన తదియనాడు వ్రతాన్ని ఆచరించినవారు సర్వపాప విముక్తులవుతారు.
‘‘దేవీ! నీవు నీ చిన్ననాట హిమాలయాల్లో ఈ మహా వ్రతాన్ని ఎలా ఆచరించావో చెబుతాను. విను!” అన్నాడు. భూలోకమున వివిధ పక్షులతో, విచిత్ర మృగాలతో మంచుచేత కప్పబడి బహుసుందరమైన హిమవత్ పర్వతము కలదు. హిమవంతుడా
ప్రాంతానికి ప్రభువు. నీవాతని కూతురువు.
చిన్నతనం నుంచే శివభక్తురాలవు. యుక్తవయసు వస్తున్న నీకు వరుడెవరో? అని హిమవంతుడు ఆలోచించగా, త్రిలోక సంచారి నారద మునీశ్వరులు ఒకనాడు మీ తండ్రి వద్దకు వచ్చాడు. అర్ఘ్య పాద్యాలందించి మీ తండ్రి నిను చూపి, ఈ కన్యని ఎవరికిచ్చి వివాహం చేయదలిచావు? తగిన వరుడెవరని నారదుని అడిగినాడు. వెంటనే నారదుడు ‘ఓ గిరిరాజా! నీ కన్యారత్నానికి అన్నివిధముల యోగ్యమైనవాడు బ్రహ్మాదిదేవతలలో విష్ణువు.
అతడు పంపితేనే నీ వద్దకు వచ్చానన్నాడు. సంతోషంతో హిమవంతుడు మునీంద్రా ఆ విష్ణుదేవుడే స్వయంగా ఈ కన్యను కోరి నిను పంపాడు కనుక గౌరవించి, అతనికిచ్చి వివాహం చేస్తానని వెంటనే తెలుపుమన్నాడు. నారదుడు అందుకు అంగీకరించి బయలుదేరాడు. హిమవంతుడు ఆనందంతో భార్యాపిల్లలకు ఆ విషయం తెలిపాడు. కుమార్తెను దగ్గరకు పిలిచి “ఓ పుత్రీ! గరడవాహనునితో నీ వివాహం నిశ్చయం చేస్తున్నానని” తెలిపెను. ఆ మాటలు విని పార్వతి తన మందిరంలోకి వెళ్లి చాలా దుఃఖించసాగింది. ఇది చూసిన పార్వతి ప్రియసఖి ఆమె మనసా పెండ్లికి సుముఖంగా లేదని తెలుసుకుని స్నేహితురాలికొక ఉపాయం చెప్పింది. నీ త్రండి జాడ తెలియని అడవిలోకి మనమిద్దరం కొంతకాలం పారిపోదామని చెప్పింది. ఆమె అనుమతితో ఇద్దరూ వనప్రాంతానికి ప్రయాణమైనారు. కుమార్తె కనిపించుటలేదని గిరిరాజు హాహాకారాలు చేసి, ఏడ్చి మూర్ఛిల్లాడు.
నీవు పరమశివుని గూర్చి ఘోర తపస్సు
చేశావు. అడవిలో దొరికిన ఫలాలతో, పుష్పాలతో, పత్రాలతో అనేక విధాల పూజించావు. నీభక్తికి మెచ్చి సైకత లింగాన్ని (ఇసుక) చేసుకొని పూజిస్తున్న నీకు భాద్రపదశుక్ల తదియనాడు నేను ప్రసన్నుడైనాను. చెలికత్తెచే హరింపబడినావు కనుక ఈ వ్రతాన్ని ‘‘హరితాళిక వ్రతం” అంటారు. ఆరోజు శివరాత్రి వలె
ఉపవసించి, రాత్రంతా జాగరణతో ఎవరైనా
పరమశివుని సైకత లింగాన్ని పత్రపుష్పాలతో పూజిస్తారో వారికి సకల సౌభాగ్యాలు, సంపత్తులు కలుగుతాయి” అని పరమేశ్వరుడు పార్వతితో చెప్తాడు.
వ్రత విధానం:
16 ఉత్తరేణి ఆకులతో 16 వరుసల దారాన్ని తోరాముగా చేసి భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం నోచుకోవాలి. తెల్లవారి వినాయకచవితి రోజు దంపతులకు భోజన, వస్త్ర, దక్షిణ తాంబూలాలతో పార్వతీ పరమేశ్వరులుగా భావించి పూజించాలి. ముత్తైదువలంతా చవితి తెల్లవారుఝామున మేళతాళాలతో సైకత లింగరూపంలోని సాంబశివుని దగ్గరలోని జలాశయంలో నిమజ్జనం చేయాలని శివుడు పార్వతికి వివరించాడు.
No comments:
Post a Comment