దారుకుడు హస్థినకు చేరుట:
శ్రీకృష్ణుడి ఆదేశముతో హస్థినకు చేరిన దారుకుడు హస్థినకు పోయి పాండవులను కలుసుకుని యాదవులకు వారి చిన్నతనములో మునులు ఇచ్చిన శాపము. ఆ శాప ఫలితముగా యాదవులు అందరూ మద్యము సేవించి ఆ మత్తులో ఒకరిని ఒకరు కొట్టుకుని మరణించడము. యాదవ కులము అంతా అంతరించడము అంతా వివరించి చెప్పాడు. బలరామ కృష్ణులు అడవిలోకి వెళ్ళిన విషయము చెప్పాడు. అర్జునుడిని తీసుకుని శ్రీకృష్ణుడు రమ్మని చెప్పిన విషయము చెప్పాడు. యాదవులు అందరూ నశించిన విషయము విన్న పాండవులు శోక సముద్రములో మునిగిపోయారు. అంతఃపురానికి ఈ వార్త అందింది. ద్రౌపది, సుభద్ర మొదలగు వారు పెద్ద పెట్టున ఏడవడము మొదలు పెట్టారు.
అంతా సద్దుమణిగాక దారుకుడు " అర్జునా ! శ్రీకృష్ణుల వారు తమరిని వెంటనే ద్వారకకు రమ్మని ఆదేశించారు " అన్నాడు. అర్జునుడు ధర్మరాజు అనుమతి తీసుకుని వెంటనే ద్వారకకు బయలుదేరాడు. అర్జునుడు దారుకుడితో వేగంగా ద్వారక చేరుకున్నాడు. ద్వారక అంతా నిర్మానుష్యముగా ఉంది. ఎక్కడా జనసంచారము లేదు. శ్రీకృష్ణుడు బలరాముడు ఎక్కడా కనిపించ లేదు. అర్జునుడి మనసు కీడు శంకించింది. ఏదో విపరీతము జరిగి ఉంటుంది అనుకున్నాడు. అర్జునుడు దారుకుడు వెంటరాగా రాజసౌధానికి వెళ్ళాడు. అర్జునుడిని చూడగానే శ్రీకృష్ణుడి భార్యలు అందరూ భోరుమని ఏడ్చారు. అర్జునుడు కూడా వారి బాధను చూసి తట్టుకో లేక శోకముతో కింద పడి పోయాడు.
రుక్మిణీ, సత్యభామలు అర్జునుడి సమీపానికి వచ్చి దుఃఖము ఎక్కువై కిందపడి ఏడుస్తున్నారు. వారిని అందరిని ఓదార్చడము అర్జునుడి వంతయింది. తరువాత అర్జునుడు దారుకుడు వెంట రాగా వసుదేవుడిని చూదడానికి వెళ్ళాడు. అర్జునుడికి ఒక సందేహము పట్టుకుంది. మామూలుగా యాదవులు బంధువులు చనిపోతే ఏడవడము ఒక విధముగా ఉంటుంది. ఇప్పుడు వీరంతా ఏడవడము వేరు విధముగా ఉంది. ఇంతకూ శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడు.అతడికి ఏమైంది. అతడిని గురించి ఎవరు చెప్తారు అని దిక్కులు చూస్తున్నాడు. దారుకుడికి కూడా ఏమి తెలియక అతడు కూడా బిక్కమొఖము వేసుకుని చూస్తున్నాడు. వసుదేవుడుకూడా శయ్యమీద పడుకుని భోరున ఏడుస్తున్నాడు.
అర్జునుడిని చూడగానేవసుదేవుడుపైకి లేచిఅర్జునుడిని పట్టుకుని విలపించాడు. చనిపోయిన యాదవులను అందరినీ పేరుపేరున తలచుకుని ఏడుస్తున్నాడు. కాసేపటికి వసుదేవుడి దుఃఖము ఉపశమించినది. తరువాత వసుదేవుడు అర్జునుడితో " అర్జునా ! ఎంతో పరాక్రమ వంతులు, దేవతల చేత కూడా పొగడబడిన వారు అయిన యాదవ వీరులు ఒకరితో ఒకరు కలహించుకుని సమూలముగా నాశనము అయ్యారు. ఈ ఘోరము ఎక్కడైనా ఉందా ! నీకు ఒక విషయము తెలుసా ! నీ శిష్యుడు ప్రద్యుమ్నుడు, సాత్యకి ముందుగా మరణించారు. ఇంత ఘోరము జరిగిన తరువాత కూడా నేనింకా బ్రతికి ఉన్నాను. నాదీ ఒక బ్రతుకేనా ! అయినా వీళ్ళకేమి చెడు కాలము దాపురించింది. సాత్యకి, కృతవర్మ ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకున్నారట. దానితో కొట్టుకోవడము మొదలైంది.
ఇదంతా ముందే నిర్ణయించబడింది. వీళ్ళు చిన్నతనములో చేసిన పాపము మునుల శాపము ఇలా పరిణమించినది. యాదవకులము నాశనము అయింది. ఒకరిని అనుకుని ఎమి లాభము. నీ కొక విషయము తెలుసా అర్జునా ఇదంతా శ్రీకృష్ణుడి సమక్షములో జరిగినది. శ్రీకృష్ణుడు తలచుకుంటే ఈ పోట్లాట ఆపలేడా! అయినా ఆపలేదంటే యాదవ కులనాశనము గురించి శ్రీకృష్ణుడికి ముందుగానే తెలుసు అందుకనే ఆపలేదు. ఇదంతా విధిలిఖితము. యాదవ నాశనము కావాలని శ్రీకృష్ణుడికి తెలుసు. లేకపోతే ఉత్తర గర్భములో ఉన్న పరీక్షిత్తును కాపాడిన వాడికి ఇది ఒక పెద్ద విషయమా చెప్పు. విధి నిర్ణయము అని సరిపెట్టు కోవడము తప్ప మనము చేయగలిగినది ఏమీ లేదు " అన్నాడు.... ( ఇంకా వుంది )
No comments:
Post a Comment