Wednesday, 10 July 2019

కపిల దేవహూతి సంవాదం - 59


( సాంఖ్య యోగము )

3-947-వ.
వెండియు.
3-948-సీ.
వరుస ననన్యభావంబునఁ జేసి భూ; 
తావళి యందుఁ దదాత్మకత్వ
మునఁ జూచు నాత్మీయ ఘనతరోపాదాన; 
ముల యందుఁ దవిలి యిమ్ముల వెలుంగు
నిట్టి దివ్యజ్యోతి యేకమయ్యును బహు; 
భావంబులను దోఁచు ప్రకృతిగతుఁడు
నగుచున్న యాత్మయుఁ బొగడొందు దేవ తి; 
ర్యఙ్మనుష్యస్థావరాది వివిధ
3-948.1-తే.
యోనులను భిన్నభావంబు నొందుటయును
జాలఁ గల్గు నిజగుణ వైషమ్యమునను
భిన్నుఁడై వెల్గుఁ గావున బేర్చి యదియు
దేహసంబంధి యగుచు వర్తించుచుండు.

భావము:
ఇంకా సర్వ భూతాలలోను అనన్య భావంతో, సర్వత్ర ఆత్మగా వెలుగుతూ ఉంటుంది. ఆ దివ్యజ్యోతి ఒక్కటే అయినా పెక్కింటివలె కనిపిస్తుంది. ప్రకృతిగతమైన ఆ ఆత్మ దేవతలు, మనుష్యులు, జంతువులు, స్థావరాలు మొదలైన వేరువేరు యోనులలో వేరువేరు భావాన్ని పొందుతూ భిన్న గుణాలతో భిన్నంగా వెలుగుతూ ఉంటుంది. నిజానికి దేహాలు మాత్రమే వేరు కాని వెలుగు ఒక్కటే.

http://telugubhagavatam.org/?tebha&Skanda=3&Ghatta=51&padyam=948

// తెలుగులోనే మాట్లాడుకుందాం //
: : చదువుకుందాం భాగవతం, బాగువడదాం మనం అందరం : :

No comments:

Post a Comment

శ్రీకృష్ణ విజయము - ౭౨౭(727)

( శ్రీకృష్ణ నిర్యాణంబు)  11-125-క. రాజీవసదృశనయన! వి రాజితసుగుణా! విదేహరాజవినుత! వి భ్రాజితకీర్తి సుధావృత రాజీవభవాండభాండ! రఘుకులత...